Share News

Sankranti travel 2026: సొంతంగా.. సరదాగా..

ABN , Publish Date - Jan 10 , 2026 | 02:35 PM

హైదరాబాద్ నుంచి విజయవాడకు సంక్రాంతి ప్రయాణాలు మొదలయ్యాయి. ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండటం.. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలు భయంకరంగా మారడంతో చాలామంది సెల్ఫ్ కార్లపై దృష్టిపెట్టారు. వాటినే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు. డిమాండ్ పెరగటంతో ట్యాక్సీలు, క్యాబ్‌ల నిర్వాహకులు కూడా ధరలను పెంచేశారు.

Sankranti travel 2026: సొంతంగా.. సరదాగా..

  • ఈ సంక్రాంతికి సెల్ఫ్ కార్లకు పెరిగిన డిమాండ్..

  • బస్సులు, రైళ్లు ఫుల్ కావడం, ట్యాక్సీల కిరాయిల పెంపే కారణం..

  • హైదరాబాద్ నుంచి విజయవాడకు భారీగా రానున్న కార్లు..

  • కిరాయి కార్లతో పోల్చుకుంటే రేట్లు అందుబాటులోనే..

  • పైగా సెలవుల రోజులన్నీ దగ్గరే ఉంచుకోవచ్చు..

  • హైదరాబాద్‌లో ఫుల్.. బెజవాడలో పెరుగుతున్న బుకింగ్‌లు..

  • గోదావరి జిల్లాలకు ఇక్కడి నుంచే వెళ్తున్న కార్లు..

విజయవాడ, జనవరి 10: నిన్న, మొన్నటి వరకు పెద్దగా బుకింగ్స్ లేని సెల్ఫ్ కార్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సంక్రాంతి పండక్కి చాలా మంది.. బంధువులతో సహా సెల్ఫ్ కార్లలో వస్తున్నామంటూ సమాచారం అందిస్తున్నారు. స్వయంగా ఎవరికి వారు డ్రైవింగ్ చేసుకుంటామంటే చాలు.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌‌లో అనేక సంస్థలు కార్లను అద్దెకు ఇస్తున్నాయి. బుక్ చేసుకున్న వ్యక్తి ఆ కారును తానే డ్రైవింగ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులను ఎక్కించుకుని సొంతూర్లకు వెళ్లొచ్చు. ఇందులో ఉండే సౌలభ్యం ఏమిటంటే.. కారును తమ వద్దే ఉంచుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా పెట్రోల్ కొట్టించుకుని తిరగొచ్చు. ఎన్ని రోజులైనా కారును బుక్ చేసుకోవచ్చు. రెండు, మూడు రోజులు ఉండాల్సి వచ్చినా ఆన్‌లైన్‌లో ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ సెల్ఫ్ కార్లను సౌకర్యంగా భావిస్తున్నారు.


రేట్లు ఇలా..

సెల్ఫ్ కార్లకు కిలోమీటరుకు రేటును చెల్లించాలి. సాధారణ కిరాయి కార్లతో పోల్చుకుంటే వీటి ధరలు అందుబాటులోనే ఉంటాయి. ప్రస్తుతం కిరాయి కార్లు హైదరాబాద్-విజయవాడకు డ్రాపింగ్ కే రూ.6 వేల నుంచి రూ.7 వేలు వసూలు చేస్తున్నారు. సాధారణ డిజైర్ కార్లలోనే ఈ ధర ఉంటే మిగిలిన కార్లలో చెప్పక్కర్లేదు. కుటుంబ సభ్యులు ఎక్కువమంది ఉంటే టయోటా, ఇన్నోవా వంటి కార్లు తీసుకుంటారు. వీటికి రూ.10 వేల నుంచి రూ.11 వేలు చెల్లించాలి. టయోటా క్రిస్టా కారు అయితే రూ.12వేల నుంచి రూ.13 వేలు.. ఆ పైన చెల్లించాలి. మారుతి ఎర్టిగా తీసుకోవాలంటే రూ.7 వేల నుంచి రూ.8 వేలు.. ఆపైన చెబుతున్నారు. మారుతి బ్రెజ్జా కారుకు రూ.7 వేల నుంచి రూ.8 వేలు చెబుతున్నారు. రాకపోకలైతే దాదాపు రెట్టింపు ధర ఉంటుంది. అదే సెల్ఫ్ కార్ తీసుకుంటే.. సెలవుల పది రోజులు కారును దగ్గరే పెట్టుకోవచ్చు. కారు రేంజ్‌ని బట్టి రూ.12 వేల నుంచి రూ.18 వేల చార్జీ వసూలు చేస్తారు. ఒక కారును కిరాయికి తీసుకోవాలంటే పండుగ సెలవులన్ని రోజులూ కలిపి రూ.50 వేలు ఖర్చవుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పండుగలకు సొంతూర్లకు వచ్చేవారు సెల్ఫ్ కార్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో దొరకని వారు విజయవాడ వచ్చి బుక్ చేసుకుంటున్నారు. గోదావరి జిల్లాలవైపు వెళ్లేవారు ఇక్కడి కార్లనే తీసుకెళ్తున్నారు.


Also Read:

దగ్గుబాటి కుటుంబంపై తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తప్పవు: సురేశ్ బాబు

పుతిన్‌ను కూడా ఎత్తుకొచ్చేస్తారా.. డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఏంటంటే..

విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్‌ కసిరెడ్డి..

Updated Date - Jan 10 , 2026 | 03:06 PM