Share News

సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:08 PM

టీటీడీకి నెయ్యి సరఫరాపై చేసిన ఆరోపణలు ఇప్పుడు న్యాయపోరుకు దారితీశాయి. సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే..

సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు
Sajjala Ramakrishna Reddy

అమరావతి, ఆగస్టు 20: సంగం డెయిరీ.. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంగం డెయిరీ నెయ్యి సరఫరా చేస్తోందని, అయితే పాల సేకరణ చేయకుండానే నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను సంగం డెయిరీ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను కప్పిపుచ్చి తమ సంస్థ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని పిటిషన్‌లో పేర్కొంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో సంగం డెయిరీ రైతుల నుంచి ఆవుపాలను సేకరిస్తోందని, అందుకు సంబంధించిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆరోపణలు చేశారని తెలిపింది. టీటీడీకి నెయ్యి సరఫరా విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని సంగం డెయిరీ ఆరోపించింది.


ఈ వ్యవహారంపై సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ గుంటూరు కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుపైనా కేసు నమోదు చేయాలని కోరారు. అలాగే సజ్జల చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన సాక్షి టీవీతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పైనా కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. తమ సంస్థపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా ప్రతిష్ఠ‌కు నష్టం కలిగించారని పేర్కొంటూ రూ.10 కోట్ల పరువు నష్టం చెల్లించాలని కోర్టును కోరారు. టీటీడీకి నెయ్యి సరఫరా అంశంలో తమపై వచ్చిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని సంగం డెయిరీ స్పష్టం చేస్తూ.. తమ ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలపై న్యాయపోరాటానికి దిగింది.


ఈ వార్తలు కూడా చదవండి:

కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం

క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 06:08 PM