విజయ సాయిరెడ్డిని సజ్జల కొట్టింది అక్షరసత్యం
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:13 AM
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టింది అక్షర సత్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
విజయ సాయిరెడ్డిని సజ్జల కొట్టింది అక్షరసత్యం
మంగళగిరి ప్లీనరీ విశ్రాంతి గదిలో ఘటన: ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టింది అక్షర సత్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2022లో మంగళగిరి వద్ద వైసీపీ ప్లీనరీ సందర్భంగా స్టేజీ పక్కన ఉండే విశ్రాంతి తీసుకునే గదిలో ఈ ఘటన జరిగింది. స్టేజీపై ఎవరెవరిని మాట్లాడించాలన్న విషయంపై ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగింది. మాటా మాటా పెరిగి సజ్జల, విజయసాయిరెడ్డి చొక్కాపట్టుకొని ఒక దెబ్బ కొట్టారు. కానీ విజయసాయిరెడ్డి తిరిగి కొట్టలేదు. ఈ విషయం నాకే కాదు.. అనేకమంది నాయకులకు తెలుసు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా వారి స్వగ్రామం తాళ్లపూడి వచ్చినప్పుడు నేను వంద కార్లతో ర్యాలీ నిర్వహించా.
వారానికి తాడేపల్లి వెళ్లినప్పుడు సజ్జల నాతో చాలా నీచంగా, ఘోరంగా మాట్లాడారు. వాడువీడు అంటూ అన్ని కార్లు అవసరమా? అని మాట్లాడారు. విజయసాయిరెడ్డి చెప్పినట్లు 72 అవమానాలకంటే ఇంకా ఎక్కువే ఉండవచ్చు. పాదయాత్ర చేస్తూ నా నియోజకవర్గంలోకి వచ్చిన అమరావతి రైతులు భారీ వర్షాల్లో చిక్కుకున్నారు. వారిని నేను పరామర్శించా. సాయంత్రం ఫోన్ చేసిన సజ్జల... ‘కాస్ల్టీయెస్ట్ మిస్టేక్ చేశావు’ అని అన్నారు. అయితే నేను గట్టిగానే బదులిచ్చా. రాష్ట్రంలో వైసీపీకి ఎలాగూ ప్రతిపక్ష హోదా లేదు. కనీసం రాజకీయ పార్టీగానైనా వ్యవహరించాలి. ఆత్మవిమర్శ కూడా చేసుకోకుండా ఫేక్ వీడియోలతో కుల, మతాల మధ్య చిచ్చుపెడుతోంది. వివాదాలు సృష్టించాలంటే వైసీపీ తరువాతే. విషం చల్లడం, అబద్ధాలు చెప్పడం ఆ పార్టీకి అలవాటుగా మారింది’’ అని కోటంరెడ్డి మండిపడ్డారు.