సాయికృష్ణ మృతి కేసులో ఉత్కంఠ.. సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్‌పై రేపు కోర్టు తీర్పు
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:37 PM
ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సస్పెండెడ్ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీ పిటిషన్‌పై ఏజేఎం కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిశాయి.
విజయవాడ, జూన్ 30: ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిశాయి. విచారణ సందర్భంగా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సాయికృష్ణ మరణానికి సంబంధించిన కేసు అత్యంత సంక్లిష్టమైనదని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాలంటే సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పీపీ న్యాయస్థానానికి వివరించారు.
ఇదిలా ఉంటే.. సీఐ నాగరాజు తరఫు న్యాయవాది ఈ కస్టడీ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధించడానికి కస్టడీ కోరుతున్నారని ఆరోపించారు. తమ క్లయింట్ ఇప్పటికే సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించారని, అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇస్తూ పూర్తి సమాచారాన్ని అందించారని లాయర్ వాదించారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను విన్న విజయవాడ ఏజేఎం (AJM) కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై రేపు (బుధవారం) న్యాయస్థానం తన తుది తీర్పును వెలువరించనుంది.
ఇవి కూడా చదవండి..
మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే నంబర్-1
ఐపీఎస్ సునీల్ కుమార్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన ‘క్యాట్’
Read Latest AP News And Telugu News