భూ యాజమాన్య హక్కులు ఆలయాలకే ఉండాలి: సీఎం రేవంత్
ABN , Publish Date - Jun 30 , 2026 | 03:42 PM
స్థలాలు ఎవరికి కేటాయించినప్పటికీ, ఆయా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం ఆలయాలకే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
యాదగిరిగుట్ట, జూన్ 30: స్థలాలు ఎవరికి కేటాయించినప్పటికీ, ఆయా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం ఆలయాలకే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి, భూ కేటాయింపులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ భూముల పరిరక్షణ, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన నిర్మాణాలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు భూమి కేటాయింపు విషయమై స్పందిస్తూ, సదరు ల్యాండ్‌ను ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారమే కేటాయించాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే, ఆలయ పరిధిలో వివిధ మఠాలకు స్థలాలు ఇచ్చే అంశంపై స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కుల సంఘాలకు స్థలాల కేటాయింపులపై కూడా నిర్దిష్ట నిబంధనలతో కూడిన ఒక పాలసీని సిద్ధం చేయాలని చెప్పారు.
ఈ భూ కేటాయింపుల ప్రక్రియలో దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో అనుసరిస్తున్న నిబంధనలు, విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదగిరిగుట్టపై భక్తుల వసతి కోసం నిర్మించతలపెట్టిన అతిథిగృహాల నిర్మాణంలోనూ తిరుమల మోడల్‌నే అనుసరించాలని పేర్కొన్నారు. కొండపై కాటేజీలు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపే దాతలు, సంస్థల వివరాలతో కూడిన జాబితాను తక్షణమే రూపొందించాలని, వీరికి విడతలవారీగా నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో ఒక ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ పనులు, నాణ్యతపై గతంలో నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, దానిపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను తనకు అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు డెడ్‌లైన్ విధించారు
ఇవి కూడా చదవండి..
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్
బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్...మనసులో మాట బయటపెట్టిన కోచ్ మెక్‌కల్లమ్!