Share News

సాగరతీర మహాగణపతి లడ్డూ రూ. 25 లక్షలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:55 AM

వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాల వద్ద ఉంచిన లడ్డూలకు నవరాత్రులు ముగియడంతో వేలం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు భారీగా పాల్గొని లడ్డూ దక్కించుకునేందుకు పోటీపడ్డారు.

సాగరతీర మహాగణపతి లడ్డూ రూ. 25 లక్షలు

మచిలీపట్నం టౌన్‌/నూజివీడు/చిత్తూరు కల్చరల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాల వద్ద ఉంచిన లడ్డూలకు నవరాత్రులు ముగియడంతో వేలం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు భారీగా పాల్గొని లడ్డూ దక్కించుకునేందుకు పోటీపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఏర్పాటు చేసిన 63 అడుగుల సాగరతీర మహాగణపతి చేతిలోని 630 కిలోల లడ్డూను ఎఫ్‌సీఎస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అధినేత గుమ్మడి భవానీ శంకర్‌ రూ.25 లక్షలకు దక్కించుకున్నారు. సాగరతీర మహాగణపతి ఉత్సవ సేవా సమితి కోశాధికారి కొమరగిరి చంద్రశేఖర్‌ గురువారం సాయంత్రం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా 150 మంది, ఆన్‌లైన్‌లో 414 మంది పాల్గొన్నారు. గుమ్మడి భవానీశంకర్‌ రూ.25 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. భవానీశంకర్‌ను మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఉత్సవ సేవా సమితి అధ్యక్షుడు చలమలశెట్టి నరసింహారావు, లడ్డూ ప్రదాత, మల్లయ్య స్వీట్స్‌ అధినేత గౌరా వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు.

చిత్తూరులో రూ.9 లక్షలకు దక్కించుకున్న ఎమ్మెల్యే గురజాల

చిత్తూరు నగరం డీఐ రోడ్డులో వినాయకుడికి 1.5 టన్నుల లడ్డూ ప్రసాదాన్ని నైవైద్యంగా సమర్పించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఈ భారీ లడ్డూను క్రేన్‌ సాయంతో వినాయక విగ్రహం ముందు ఉంచి శ్రీ శివశక్తి వినాయక ఉత్సవ నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ పాల్గొని 9 లక్షల 116 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు, నగరవాసులకు ఎమ్మెల్యే పంచిపెట్టారు.

మెట్టగూడెంలో రూ.15 లక్షలు

ఏలూరు జిల్లా నూజివీడు మండలం మెట్టగూడెం గ్రామంలో గురువారం సాయంత్రం గణేశ్‌ లడ్డూ వేలం జరిగింది. గ్రామానికి చెందిన శ్రీసాయి గౌతమ్‌ ఫుడ్స్‌ అధినేత వెలివెల కనకదుర్గారావు (కన్నా) లడ్డూను రూ.15,30,999 కు దక్కించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

పీజీ కోర్సుల్లో చేరేవారేరి?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే భయపడలేదు.. ఇప్పుడు భయపడతామా జగన్?!: మంత్రి లోకేశ్

Updated Date - Sep 25 , 2026 | 04:55 AM