కొబ్బరినీళ్లలో పొటాష్... ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్
ABN , Publish Date - Sep 12 , 2026 | 03:00 AM
ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసుల కస్టడీలో మౌనంగా ఉన్న సాదిక్ ఖాన్.. చివరి రోజు మాత్రం ‘విషయం’ బయటపెట్టినట్టు తెలిసింది.
జగదీశ్వరరెడ్డి మృతిపై నోరు విప్పిన సాదిక్!
కస్టడీ చివరి రోజు గుట్టు విప్పిన నిందితుడు
తనతోపాటు సౌజన్యకూ ప్రమేయం ఉందని పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం
ముగిసిన కస్టడీ.. రాజమండ్రి జైలుకు తరలింపు
కాకినాడ, అమలాపురం టౌన్/రాజమహేంద్రవరం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసుల కస్టడీలో మౌనంగా ఉన్న సాదిక్ ఖాన్.. చివరి రోజు మాత్రం ‘విషయం’ బయటపెట్టినట్టు తెలిసింది. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డి మరణంలో సాదిక్‌దే కీలక పాత్ర అని మొదట్నుంచీ పోలీసులు అనుమానిస్తున్నారు. వాటిని నిజం చేస్తూ.. ఆ మరణంపై సాదిక్ నోరు విప్పినట్టు సమాచారం. తాను నూకరాజు కుటుంబాన్ని ఎలా వేధించిందీ విచారించే క్రమంలో ఈ విషయాలు సాదిక్ బయటపెట్టినట్టు చెబుతున్నారు. తాను హైదరాబాద్ అత్తరు వ్యాపారుల నుంచి కొన్న థాయ్ పొటాషియంను కొబ్బరినీళ్లలో కలిపి జగదీశ్వరరెడ్డికి ఇచ్చానని వివరించినట్టు తెలిసింది. దానివల్ల అతడు జబ్బుపడి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. సైనేడ్‌ను ప్రొటీన్ పౌడర్‌లో కలిపించి.. దానిని బాడుగ కారులో విజయవాడకు పంపినట్టు సాదిక్ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. జగదీశ్వరరెడ్డి మరణంలో తన పాత్ర ఎంత ఉందో, ఆయన భార్య సౌజన్య పాత్ర కూడా అంతే ఉన్నట్టు చెప్పినట్టు తెలిసింది. తన కుమారుడు జగదీశ్వరరెడ్డి మృతికి సాదిక్‌యే కారణమంటూ అతడి తండ్రి భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వారి విచారణ అంతా జగదీశ్వరరెడ్డి మృతిపైనే సాగింది. నూకరాజు కుటుంబాన్ని ఎలా వేధించాడనే విషయాలు అతడి నోటి నుంచి రప్పించేందుకు ఇప్పుడు రాజమహేంద్రవరం పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మరోవైపు, సాదిక్‌ను మరోసారి విచారించాల్సి ఉందని, తిరిగి కస్టడీకి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు పిటిషన్ వేయనున్నట్టు సమాచారం.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
3 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సాదిక్‌ను శుక్రవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఫస్ట్ అడిషనల్ జేఎఫ్‌సీ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జిగా ఉన్న కాకినాడ అడిషనల్ సివిల్ జడ్జి కమ్ మొబైల్ కేసెస్ జడ్జి (జూనియర్ డివిజన్) ఎన్.ఉషాలక్ష్మికుమారి ఆదేశాలతో సాదిక్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు. సాదిక్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసు కస్టడీ పూర్తవడంతో సాదిక్ భయం లేనట్టుగా కనిపించాడు. తనకు తానుగానే నేరుగా పోలీసు వాహనం డోర్ తీసుకుని ఎక్కడం కనిపించింది. వైద్య పరీక్షల కోసం తెచ్చినప్పుడు, అక్కడినుంచి కోర్టుకు, జైలుకు తరలిస్తున్నప్పుడు ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోకుండానే పోలీసుల వెంట నడిచాడు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..