Share News

ఆ సంఘం నేత శాసిస్తాడు... రెవెన్యూ బాస్‌లు పాటిస్తారు

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:02 AM

ఆ ఉద్యోగ సంఘం నేత అనుచరులకు, వారు సిఫారసు చేసిన మరికొందరికి ఉన్నపళంగా తహసీల్దార్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికోసం రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న వైనం రెవెన్యూ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది.

 ఆ సంఘం నేత శాసిస్తాడు... రెవెన్యూ బాస్‌లు పాటిస్తారు

  • పదోన్నతుల్లో ఉన్నతాధికారుల వింత పోకడ

  • ఓ వైపు ‘సర్‌’.. మరోవైపు ఖరారుకాని సీనియారిటీ

  • అయినా ఆ నేత అనుచరులకు తహసీల్దార్‌ చాన్స్‌

  • హైకోర్టు ఆదేశాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు బేఖాతర్‌

  • పదేపదే పదోన్నతుల కోసం ఫైలు

  • డీటీల సీనియారిటీ ఫిక్స్‌ కాకుండానే జాబితా సిద్ధం

ఆ ఉద్యోగ సంఘం నేత అనుచరులకు, వారు సిఫారసు చేసిన మరికొందరికి ఉన్నపళంగా తహసీల్దార్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికోసం రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న వైనం రెవెన్యూ శాఖలోనే చర్చనీయాంశంగా మారింది. తమ అనుమతి లేకుండా జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల పదోన్నతులు ఇవ్వకూడదని సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖలు స్పష్టంగా తెలిపినా, విషయం ముందుకు కదులుతోంది. మొత్తం వ్యవహారంలో ఓ ఉద్యోగ సంఘం నేత ఒత్తిళ్లు ఉన్నతాధికారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, సీసీఎల్‌ఏ కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఆయన ‘సొంత మనిషి’ మొత్తం మంత్రాంగం నడుపుతున్నారని సమాచారం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రెవెన్యూశాఖలో 100 తహశీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్‌లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారానే ఆ పోస్టులు భర్తీ చేయాలి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్‌) నడుస్తోంది. కాబట్టి అది పూర్తికాకుండా, ముందుగానే పదోన్నతులు, బదిలీలను చేపట్టడం సరైంది కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు, పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ల సీనియారిటీని ఖరారు చేయాలి. రెవెన్యూశాఖ 2014-15 నుంచి 2017-18 వరకే డీటీల సీనియారిటీని ఖరారుచేసి ఇటీవల 300 మందికి తహశీల్దార్లుగా పదోన్నతులు ఇచ్చి ఆ తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇదంతా ఓటర్ల ‘సర్‌’ ప్రక్రియ ప్రారంభానికి ముందే జరిగింది. ఇంకా కోర్టు ఆదేశాల మేరకు 2018-2024 సంవత్సరాల డీటీల సీనియారిటీని ఖరారు చేయాలి. ఆ తర్వాతే పదోన్నతులు ఇవ్వాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 2024 వరకు డీటీల సీనియారిటీని ఖరారుచేసిన తర్వాతే పదోన్నతులు ఇవ్వాలి. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం అమల్లో ఉంది. సర్‌ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకా నెలన్నర సమయం ఉంది. ఈలోగా రెగ్యులర్‌ పదోన్నతులు, బదిలీలు చేపట్టకూడదని ప్రభుత్వం భావిస్తోంది.


సంఘం నేత కోసం అధికారి ఆరాటం

రెవెన్యూ శాఖలో ఓ ఉద్యోగ సంఘం నేత తన అనుయాయులకు పదోన్నతులు ఇప్పించేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. సంఘంలో కార్యవర్గ సభ్యులుగా, జిల్లాల్లో క్రియాశీలక సభ్యులుగా ఉన్న 28 మంది డిప్యూటీ తహశీల్దార్లకు ఉన్నపళంగా తహశీల్దార్‌ పదోన్నతులు ఇప్పించేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. భూ పరిపాలనా ప్రధాన కమిషనరేట్‌ (సీసీఎల్‌ఏ)లో ఉన్న ఓ మధ్యస్థాయి అధికారి ద్వారా పదోన్నతుల ఫైలును కదిలించారు. ఎనిమిదేళ్లుగా ఆయన అక్కడే పని చేస్తున్నారు. రెవెన్యూ విభాగం నుంచే ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది అక్కడే తిష్ఠ వేశారు. ఒక అధికారి ఎనిమిదేళ్లుగా ఎలాంటి బదిలీ లేకుండా, కనీసం సెక్షన్‌ మార్పు లేకుండా ఒకేచోట పనిచేస్తున్నారంటే కారణం ఆ ఉద్యోగ సంఘం నేత సొంత మనిషి కావడమే. ఆయనపై ఎన్ని ఆరోపణలు, తీవ్రమైన అభియోగాలు వచ్చినా విచారణ, చర్యలు లేవు. ఈయనే ఇప్పుడు పదోన్నతుల ఫైలు కదిలించారు. 28 మంది డీటీల్లో 18మంది ఓ ఉద్యోగ సంఘంలో కార్యవర్గ సభ్యులు. మిగిలిన వారిలో ఆరుగురు సంఘం పరిధిలో జిల్లాల్లో క్రియాశీలక సభ్యులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరిని సత్వరం తహశీల్దార్లుగా చేసి వారు కోరుకున్న చోట్ల పోస్టింగ్‌ ఇప్పించాలని ఆ ఉద్యోగ నేత తపనపడుతున్నారు. నిబంధనలు అంగీకరించవని తెలిసినా, ఓ ఉన్నతాధికారి దీనిపై అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో పదోన్నతుల వ్యవహారం రచ్చకెక్కింది.


అనుమతి లేకుండానే...

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం డీటీల సీనియారిటీ ఖరారయ్యాకే పదోన్నతులు చేపట్టాలి. ఈ విషయాన్ని ఇప్పటికే రెవెన్యూశాఖకు జీఏడీ, ఆర్థికశాఖలు పలుమార్లు స్పష్టం చేశాయి. అప్పుడు రెవెన్యూశాఖ ఏం చేయాలి? ఇటు ప్రభుత్వ ఆదేశాలు, అటు కోర్టు ఉత్తర్వుల మేరకు ముందు డీటీల సీనియారిటీని 2017-18 నుంచి 2024 వరకు ఖరారు చేయాలి. కానీ ఇప్పటి వరకు ఆ పనే పూర్తి చేయలేదు. సీనియారిటీ లేకుండా డీపీసీ పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే రెండుసార్లు రెవెన్యూశాఖ ప్రతిపాదించినా అనుమతులు రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే ఉద్యోగ సంఘం నేత, ఆయన సొంతమనిషి అయిన అధికారి ఈ వ్యవహారాన్ని కదిలించారు. కేవలం రెవెన్యూశాఖ కార్యదర్శికి ఫైలు పంపి అనుమతి తీసుకొని డీపీసీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారి కూడా సానుకూలంగా స్పందించి డీపీసీకి ఆగస్టు 31 డేట్‌ అని అధికారికంగా అనుమతిచ్చారు. దీంతో సీసీఎల్‌ఏలో సంఘం నేత ఆశీస్సులున్న ఓ మధ్యస్థాయి అధికారి కేంద్రంగా బేరసారాలు కూడా మొద లైనట్లు తెలిసింది. తమ పేరు కూడా పదోన్నతి జాబితాలో ఉంచాలని జిల్లాల నుంచి ఆశావహులు అనేక మార్గాల్లో ఆ అధికారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదే అదనుగా పని కావాలంటే ఆయన్ను కలవాలని సంఘం నేత కూడా ఆశావహులకు చెప్పినట్లుగా అధికారవర్గాలు బాహటంగానే చెబుతున్నాయి.

సీనియారిటీ లేకుండా పదోన్నతులు తప్పుకాదా?

హైకోర్టు ఆదేశాల మేరకు సీసీఎల్‌ఏ కార్యాలయం తొలుత డిప్యూటీ తహశీల్దార్ల సీనియారిటీ ఖరారు చేయాలి. ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా డీటీలకు పదోన్నతి ఇవ్వాలి. కానీ, రెవెన్యూశాఖ డీటీల సీనియారిటీ ఖరారు చేయకుండా, ప్రభుత్వ ఆమోదం తీసుకోకుండానే డీపీసీకి పదేపదే ప్రభుత్వ అనుమతులు కోరుతోంది. ఇందులోని ఆంతర్యం ఏమిటి... ఇలా చేయడం సరికాదని ఉన్నతాధికారులకు తెలియదా... అనే చర్చ జరుగుతోంది.


ఈ వార్తలను కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..

పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 05:03 AM