సమస్యకు సరైనదారి.. పరిష్కారం పక్కదారి
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:50 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్) ఓ అద్భుతమైన వేదిక. సమస్యల పరిష్కారంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బలమైన వారధి. కానీ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల తీరే పరిష్కారం దిశ, దశను మార్చేస్తున్నాయి. సమస్యల పరిష్కారంపై శ్రద్ధ, ప్రజాసేవపై అంకితభావం లేకపోవడమే ఇందుకు కారణం.
పీజీఆర్‌ఎస్‌లో అధికారుల అలసత్వం
ప్రజల ఫిర్యాదులపై అసంబద్ధ వర్గీకరణ
తమ పరిధిని తప్పించేందుకు తొందరపాటు ఎండార్స్‌మెంట్లు
పరిష్కారంపై క్రాస్‌వెరిఫికేషన్ నిల్
పెండింగ్ బదులు రిజెక్ట్
లోపాలను గుర్తించిన రెవెన్యూశాఖ
పక్కా పరిష్కారానికి సూచనలు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్) ఓ అద్భుతమైన వేదిక. సమస్యల పరిష్కారంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య బలమైన వారధి. కానీ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారుల తీరే పరిష్కారం దిశ, దశను మార్చేస్తున్నాయి. సమస్యల పరిష్కారంపై శ్రద్ధ, ప్రజాసేవపై అంకితభావం లేకపోవడమే ఇందుకు కారణం.
కొందరు అధికారులు పీజీఆర్‌ఎస్‌ను ఓ ప్రహసనంలా మార్చేస్తున్నారు. పరిష్కార మార్గాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫలితంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదే పదే ఒకే అంశంపై వరుస దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఇలా వచ్చిన వాటిని తమ పరిధి నుంచి త్వరత్వరగా తొలగించేందుకు అసంబద్ధమైన వర్గీకరణలు చేస్తున్నారు. తొందరపాటు, నిరర్ధకమైన ఎండార్స్‌మెంట్‌లతో బుట్టదాఖలు చేస్తున్నారు. కొందరు అధికారులు మరో అడుగు ముందుకేసి బోగస్ పిటిషన్‌లుగా, రిపీటెడ్ దరఖాస్తులుగా పేర్కొంటూ పెండింగ్ పెట్టడం లేదా రిజెక్ట్ చేయడంచేస్తున్నారు. దీంతో ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లే వచ్చి పరిష్కారం కాకుండానే బుట్టదాఖలవుతున్నాయి. ఇది ఎవరో చెబుతున్న మాటకాదు. స్వయంగా రెవెన్యూ శాఖ తన నివేదికలో పొందుపరిచిన అంశం. గత నెలలో అమరావతిలో జరిగిన జాయింట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సాక్షిగా ఈ అంశాలు చర్చకొచ్చాయి. లోపం ఎక్కడుందో కనిపెట్టారు. పరిష్కారాలు చూపారు. ఆచరణలో అమలు చేస్తారా? పీజీఆర్‌ఎస్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తారా? అన్నది అధికారుల ఆచరణపైనే ఆధారపడి ఉంది.
జేసీల సదస్సులో చర్చ
పీజీఆర్‌ఎస్ అంటే.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వానికి వివిధ రూపాల్లో పంపించే దరఖాస్తులను ప్రాసెస్ చేసి, అందులోని అంశాలకు పరిష్కారమార్గాలు చూపించడం. ఆ తర్వాత సంబంధిత విభాగం నుంచే అర్జీదారుకు ఫోన్ చేసి.. ‘మీ సమస్య పరిష్కారం అయిందా? లేదా’ అని ఐవీఆర్‌ఎస్ డేటా ద్వారా సమాచారం సేకరించి ప్రజల స్పందనను ప్రభుత్వం తెలుసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వారంలో కనీసం మూడు రోజులు ఇదే అంశంపై ప్రత్యేక సమీక్షలు చేస్తున్నారు. కానీ ఫలితాలు కొంతమేరకే కనిపిస్తున్నాయి. ప్రజా సంతృప్తి స్థాయి ప్రభుత్వం అనుకున్నంత గొప్ప స్థాయిలో ఉండటం లేదు. కారణాలు ఏమిటా అని రెవెన్యూ శాఖ అధ్యయనం చేసింది. అందులో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. వాటినే నివేదిక రూపంలో పెట్టి జాయింట్ కలెక్టర్ల సదస్సులో చర్చించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పీజీఆర్‌ఎస్‌లో ఐదు రకాల లోపాలను గుర్తించింది. అవేమిటంటే..
తప్పుడు వర్గీకరణే అసలు సమస్య
ఓ పేదవాడు తనకు ఇంటి స్థలం లేదని, సొంతింటి భాగ్యం కల్పించాలని ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకుంటే, దాన్ని ఏ విభాగానికి పంపించాలి? పీజీఆర్‌ఎస్‌లో అత్యంత కీలకమైన తొలి అడుగు ఇదే. ఇంటి స్థలం అనగానే.. గృహ నిర్మాణ శాఖ లేదా హౌసింగ్ బోర్డుకు పంపాలా? లేక రెవెన్యూ శాఖకు పంపించాలా? తహశీల్దార్ ఆఫీసుకు వచ్చే ఈ పిటిషన్‌పై ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ఏ విభాగానికి పంపించేలా ట్యాగ్ చేయాలి? ఇక్కడే సమస్య వస్తోంది. పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేది రెవెన్యూ శాఖ అని ఒకరు, కాదు హౌసింగ్ కార్పొరేషన్ అని మరొకరు ట్యాగ్ చేసి అసంబద్ధమైన వర్గీకరణ చేసి పిటిషన్‌లను ఆయా విభాగాలకు పంపిస్తున్నారు. ఇలా వచ్చినవి తమకు సంబంధం లేదని ఆయా విభాగాల అధికారులు ఆ పిటిషన్‌లను బుట్టదాఖలు చేస్తున్నారు. కొందరైతే పిటిషన్‌లోని అంశాలను చూడకుండానే రిజెక్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇంటి స్థలం కోసం దరఖాస్తును హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు పంపాలి. మరో ఉదాహరణ తీసుకుంటే.. ఒక రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం సమస్య ఉందని, దాన్ని పరిష్కరించాలని వచ్చే పిటిషన్‌ను రెవెన్యూలో ఏ విభాగానికి పంపించాలి? ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చూసే సెక్షన్‌కా? లేక భూముల కేటాయింపు విభాగానికా? చాలా సందర్భాల్లో ఆర్‌ఓఆర్‌కు కాకుండా భూ కేటాయింపుల సెక్షన్‌కు పంపిస్తున్నారు. అలా వెళ్లినవి షరా మామూలుగానే బుట్టదాఖలవుతున్నాయి. ఒక గ్రామంలో పేదకుటుంబం తనకు బియ్యం కార్డు కావాలని దరఖాస్తు చేసుకుంటే పౌరసరఫరాల శాఖకు పంపించాలి. కానీ దాన్ని కూడా రెవెన్యూ శాఖకు ట్యాగ్ చేసి పంపిస్తున్నారు. దీంతో రేషన్‌కార్డులు ఇచ్చే అధికారం తమకు ఎక్కడిదని రెవెన్యూ అధికారులు దాన్ని తిరస్కరిస్తున్నారు. ఇలా ప్రజల సమస్యలను సరైన విభాగాలకు పంపించకపోవడం వల్లే అనేక సమస్యలు బుట్టదాఖలవుతున్నాయి.
కాగితాల్లోనే పరిష్కారం
ప్రజల సమస్యల్లో కొన్ని గ్రామ, మరికొన్ని మండల స్థాయిలో పరిష్కరించేవి ఉంటాయి. కొన్ని జిల్లా స్థాయిలో, మరి కొన్ని ప్రభుత్వ స్థాయిలో అంటే.. అమరావతి పరిధిలో తీసుకునే నిర్ణయాల వల్ల పరిష్కారం ఉంటుంది. అలాంటి విషయాల్లో ఏ పిటిషన్‌ను ఎవరికి సిఫారసు చేయాలి? ఏ విభాగానికి పంపాలి? అన్న అంశాలపై అధికారులకు స్పష్టత లేదు. అసంబద్ధమైన ఎండార్స్‌మెంట్‌లు చేస్తున్నారు. అంటే.. సమస్యను నిజమైన వాస్తవిక కోణంలో పరిష్కరించాలన్న తపన కన్నా, ముందు తమ పరిధి దాటి ఎవరో ఒకరి లాగిన్‌కు పంపిస్తే తమవద్ద పెండింగ్ లేదని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రజా సమస్యల పరిష్కారం కాగితాల్లో ఉంటోంది కానీ వాస్తవికంగా కనిపించడం లేదని రెవెన్యూ శాఖ చెబుతోంది.
పిటిషన్ మాంగర్స్ దుర్వినియోగం
ప్రతీ వ్యవస్థలో మంచి ఉన్నట్లే చెడు కూడా ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం నిజమైన అర్జీలు ఇచ్చేవారితో పాటే అబద్ధాలు, అసత్యాలతో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేవారు ఇచ్చే పిటిషన్‌లు కూడా ఉంటున్నాయి. దీంతో విలువైన సమయం వృథా అవుతోంది. కొందరు పిటిషనర్ మాంగర్స్ ఇచ్చే అర్జీల వల్ల కూడా సమస్యలు వస్తున్నాయని రెవెన్యూ శాఖ నివేదిస్తోంది. కాగా, ప్రభుత్వం దృష్టికి ఒక సమస్య వస్తే దాని పూర్వాపరాలు తెలుసుకోవాలి. అది పరిష్కారం అయ్యాక అర్జీదారుకు సమాచారం ఇవ్వాలి. ఇదంతా క్రాస్‌వెరిఫికేషన్‌తోనే సాధ్యం. కానీ పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో క్రాస్‌వెరిఫికేషన్ ఉం డటం లేదు. ఒకసారి దరఖాస్తు పరిష్కారం అయిందని చెప్పాక, అది నిజంగా సెటిల్ అయిందా? లేదా? మరోసారి అదే అంశంపై పిటిషన్‌లు వస్తున్నాయా? అని పున:పరిశీలన, విభిన్న కోణాల్లో పరిశీలించే వ్యవస్థ ఏదీ వినియోగంలో లేదు. దీనివల్ల పరిష్కార శాతం తక్కువగా ఉంటోంది.
చట్టబద్ధమైన అవగాహనేదీ?
ప్రజలు ఇచ్చే అర్జీల్లో అనేక చట్టబద్ధ్దమైన, న్యాయపరమైన అంశాలు, సంక్లిష్టతలో కూడిన విషయాలు ఉంటాయి. వాటిపై అధికారులకు సరైన అవగాహన ఉండటం లేదు. ఫలితంగా ఏ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ఏ చట్టం పరిధిలో ఏ అంశం పరిష్కరించాలన్న కనీస అవగాహన కొందరు అధికారులకు ఉండటం లేదు. చట్టాలు, వాటి అమలుకు సంబంధించిన రూల్స్, నిర్దిష్టమైన కార్యాచరణ(ఎస్ఓపీ)తో సంబంధం లేకుండానే అధికారులు పిటిషన్‌లపై ఎండార్స్‌మెంట్‌లు రాస్తున్నారు. దీని వల్ల పరిష్కారానికి బదులు పెండింగ్ లేదా రిజెక్టుకు గురికావడమో జరుగుతోందని రెవెన్యూ శాఖ చెబుతోంది.
పరిష్కారాలు ఇవే
పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూ అంశాల పరిష్కారం పక్కాగా ఉండేందుకు ఆ శాఖ కొన్ని నిర్దిష్టమైన పరిష్కారాలు సూచించింది.
ప్రజల నుంచి వచ్చే అర్జీలపై తహశీల్దార్‌లు ఎలాంటి ఎండార్స్‌మెంట్‌లు ఇస్తున్నారో రోజువారీగా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు పరిశీలించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.
పరిష్కారానికి స్వీకరించిన పిటిషన్లలో 15 శాతం ఆర్డీఓ ఆడిట్ కోసం పంపించాలి. మరో 10 శాతం అర్జీల వివరాలను జేసీ ఆడిట్ కోసం పంపించాలి.
పీజీఆర్‌ఎస్‌లో రెవెన్యూ సేవల పరిష్కారంపై ప్రజలకు మరింత స్పష్టత, జవాబుదారీ తీసుకురావాలి. ఇందుకోసం ప్రతీ నెల తొలి వారంలో జాయింట్ కలెక్టర్లు తమ పరిధిలో ఆర్డీఓల కాన్ఫరెన్స్ నిర్వహించాలి. ఆ సమావేశం మినిట్స్‌ను సీసీఎల్‌ఏ కార్యాలయానికి విధిగా పంపించాలి.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!