Share News

అనంతలో అరుదైన అతిథులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:38 AM

అనంతపురం పేరు చెబితే కరువు గుర్తుకొస్తుంది. ఇక్కడి నదులు, వాగులు, వంకల్లో నీరు కాకుండా ఇసుకతిన్నెలు కనిపిస్తాయి.

అనంతలో అరుదైన అతిథులు
bird

  • కరువునేలపై విదేశీ పక్షుల సందడి

  • ఖండాంతర వలస పక్షి యూరోపియన్‌ రోలర్‌ రాక

  • చాలా ఏళ్ల తర్వాత ఈజిప్షియన్‌ వల్చర్‌ దర్శనం

  • ఉత్తరాదికే పరిమితమైన బ్రౌన్‌ రాక్‌చాట్‌ చక్కర్లు

  • విశ్రాంతి కేంద్రంగా ఉమ్మడి అనంత జిల్లా

  • మారుతున్న భూ వాతావరణ పరిస్థితులే కారణం

(అనంతపురం వైద్యం-ఆంధ్రజ్యోతి)

అనంతపురం పేరు చెబితే కరువు గుర్తుకొస్తుంది. ఇక్కడి నదులు, వాగులు, వంకల్లో నీరు కాకుండా ఇసుకతిన్నెలు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా బీడు భూములు ఉంటాయనే ముద్ర ఉంది. ఈ పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తోంది. ఓ వైపు పరిశ్రమలు, మరోవైపు ఉద్యాన పంటలతో అభివృద్ధి దిశగా ఈ కరువు నేల పరుగులు తీస్తోంది. అంతేకాదు ఇప్పుడు అత్యంత అరుదైన విహంగాలకు, ఖండాంతర వలస పక్షులకు సురక్షిత ఆవాసంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్న ఈజిప్షియన్‌ వల్చర్‌(రాబందు), ఐరోపా నుంచి ఆఫ్రికాకు వలస వెళ్లే యూరోపియన్‌ రోలర్‌, దక్షిణ భారతదేశంలో అరుదుగా కనిపించే బ్రౌన్‌ రాక్‌చాట్‌ వంటి పక్షులు తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దర్శనమిస్తున్నాయి. దీంతో పక్షి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, పక్షి శాస్త్రవేత్తలు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా బయోడైవర్సిటీ క్లబ్‌ సభ్యులు డాక్టర్‌ సుశ్రిత ఇలాంటి ఎన్నో అరుదైన పక్షులను గుర్తించి, తన కెమెరాలో బంధించారు.


atp2 copy.jpg

విరిగిన ముక్కుతో ఖండాంతర పోరాటం

అనంతపురం జిల్లా రాప్తాడు పరిసర ప్రాంత పొలాల్లో యూరోపియన్‌ రోలర్‌ను గుర్తించారు. దీని ముక్కు కింది భాగం విరిగిపోయి కనిపించింది. మన దేశీయ పాలపిట్టకు దగ్గరి బంధువైన ఈ పక్షి ఐరోపా, మధ్య ఆసియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికా ఖండానికి వలస వెళుతుంది. ఈ ప్రయాణ మార్గంలో విశ్రాంతి తీసుకునేందుకు అనంతపురం జిల్లా గడ్డి భూములను ఎంచుకుంది. విరిగిన ముక్కుతోనే ఆహారాన్ని వేటాడుతూ, సుదీర్ఘ వలస ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. వర్షాభావం కారణంగా సాగుచేసిన ఆముదం పంటపొలంలో ఆహార వేటసాగిస్తూ కనిపించింది.

atp3 copy.jpg

ఈ పక్షి ప్రతిభ ప్రత్యేకం

అనంతపురం నగర శివారులో జాతీయ రహదారి పక్కన ఒక కట్టడంపై బ్రౌన్‌ రాక్‌చాట్‌ కనిపించింది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైన ఈ పక్షి ప్రధానంగా ఉత్తర, మధ్య భారతదేశంలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఇది కనిపించడం చాలా అరుదు. ఇతర పక్షుల గొంతులను అచ్చుగుద్దినట్లు అనుకరించే (మిమిక్రీ) ప్రతిభ ఈ పక్షి సొంతం. ఇలాంటి పక్షి అనంతపురం నగర పరిసరాల్లో కనిపించడం స్థానిక పర్యావరణ అనుకూల వాతావరణాన్ని సూచిస్తోంది.

మళ్లీ.. రా‘బందువు’

అనంతపురం రూరల్‌ మండలంలోని కాటిగానికాలువ గ్రామ సమీపంలో చాలా ఏళ్ల తరువాత ఈజిప్షియన్‌ వల్చర్‌ (రాబందు) దర్శనమిచ్చింది. గ్రామ సమీపంలో చెరువు ఉంది. ఇక్కడి చిత్తడినేలల్లో ఒక చిన్న వయసు ఈజిప్షియన్‌ రాబందు సంచరిస్తూ కనిపించింది. సుమారు 11 సంవత్సరాల కిందట ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రత్నగిరి కొండప్రాంతంలో ఈ జాతి పక్షి కనిపించింది. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ దర్శనమివ్వడం విశేషం. అంతరించిపోతున్న పక్షి జాతుల జాబితాలో ఉన్న ఈ పక్షిని ‘ప్రకృతి పారిశుధ్య కార్మికుడు’ అని పిలుస్తారు. పశువుల కళేబరాలను తినేందుకు ఒకప్పుడు గుంపులు గుంపులుగా వాలిపోయేవి. కానీ పశువులకు వాడే డైక్లోఫినాక్‌ మందుల కారణంగా వాటి మాంసాన్ని తిన్న 80 శాతానికి పైగా రాబందులు అంతరించిపోయాయి. ఇన్నాళ్ల తరువాత చిన్నారి రాబందు కనిపించడం రాయలసీమ ప్రాంతాల్లో వీటి సంతతి మళ్లీ వృద్ధి చెందుతోందడానికి బలమైన సంకేతమని పర్యావరణవేత్తలు అంటున్నారు.


atp5 copy.jpgపక్షులకు విశ్రాంతి కేంద్రంగా...

ఒక ప్రాంతంలో అరుదైన పక్షులు కనిపించడం యాదృచ్ఛికం కాదు. దాని వెనుక కీలకమైన భూ వాతావరణం, పర్యావరణ మార్పులు ఉంటాయని నిపుణులు విశ్లేషిసున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకేచోట విశాలమైన గడ్డి భూములు, రాతి కొండలు, చిట్టడవులు, చెరువులు ఉన్నాయి. మిడతలు, కీటకాలు, చిన్న సరీసృపాలు దొరికే అత్యుత్తమ ఆహారపు గొలుసు(ఫుడ్‌ చైన్‌) ఇక్కడ ఉంది. బట్టమేక పక్షి నుంచి యూరోపియన్‌ రోలర్‌ వరకు అనేక పక్షులకు ఇక్కడ ఆహారం దొరుకుతుందని అంటున్నారు. మరోవైపు గత దశాబ్ద కాలంతో పోలిస్తే కరువు నేలలో పర్యావరణపరంగా చాలా మార్పులు జరిగాయని గుర్తుచేస్తున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కారణంగా కాలువలు, చెరువులలో నిత్యం ఎంతో కొంత నీరు ఉంటోంది. వర్షపాత సరళిలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. ఈ పరిస్థితులు ఉమ్మడి అనంతపురం జిల్లాను వలస పక్షులకు విశ్రాంతి కేంద్రంగా(స్టాప్‌ ఓవర్‌) మార్చాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.

atp6 copy.jpg

పక్షుల పరిరక్షణతో సమతుల్యత..

పక్షులను పరిరక్షించుకుంటేనే జీవవైవిధ్యంలో సమతుల్యత ఏర్పడుతుంది. ఈ దిశగా నా వంతుగా కొంతైనా సాధించాలనే సంకల్పంతో పక్షులను గుర్తించేందుకు కృషి చేస్తున్నారు. యూరోపియన్‌ రోలర్‌, బ్రౌన్‌ రాక్‌చాట్‌, ఈజిప్షియన్‌ వల్చర్‌, బట్టమేకపక్షి వంటి వాటిని అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో గుర్తించాను. నేను వృత్తిపరంగా ఈఎన్‌టీ వైద్యురాలిని. నా వృత్తి, ఆదాయం వదులుకుని పక్షుల పరిరక్షణకు కృషి చేస్తున్నాను.

- డాక్టర్‌ సుశ్రిత, అనంతపురం జిల్లా బయోడైవర్సిటీ క్లబ్‌ సభ్యురాలు

ఆకర్షణీయంగా టెయిల్డ్‌


బ్లూ టెయిల్డ్‌ బీ ఈటర్‌.. మెరిసే ఆకుపచ్చ రంగు శరీరం, పసుపు- గోధుమ రంగుల గొంతు, కళ్లవద్ద నల్లటి గీతతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీని తోకభాగం ప్రకాశవంతమైన నీలం రంగుంలో ఉండి, మధ్యలో సన్నని సూదిలాంటి రెండు పొడవాటి ఈకలు ఉంటాయి. పేరుకు తగ్గట్టే ఇది గాల్లో ఎగురుతూనే, అత్యంత వేగంగా తేనెటీగలు, కందిరీగలు, తూనీగలు, మిడతలను వేటాడి తింటుంది. హిమాలయా పర్వతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణాదికి వస్తుంది. అనంతపురం జిల్లాలోని చెరువులు, తోటల పరిసరాల్లో ఇవి సందడి చేస్తున్నాయి.

ఖండాంతర వలస ప్రయాణం

ఐరోపా, పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాల్లో గుడ్లుపెట్టి పిల్లలను పొదిగే వైట్‌ స్టార్క్‌ పక్షులు శీతాకాలంలో ఖండాంతర వలస ప్రయాణం చేస్తాయి. అక్కడ మంచు కప్పేయడంతో వేల కిలోమీటర్లు ప్రయాణించి అనంతపురం జిల్లాకు వస్తున్నాయి. పొలాలు, బురద నేలల్లో తిరుగుతూ మిడతలు, కీటకాలు, ఎలుకలు, చిన్నపాములను తింటూ రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 06:18 AM