చేతులెలా వచ్చాయ్!
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:57 AM
తొమ్మిది నెలలపాటు తన గర్భంలో మోసింది. పురిటి నొప్పులు పడింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి కడుపులో నుంచి ఒడిపైకి చేరాల్సిన ఆ పసికందు.. ఓ ఫ్యాక్టరీ ప్రహరీ పక్కన ముళ్లపొదల్లోకి చేరింది.
ముళ్లపొదల్లోకి చేరిన పసికందు
తొమ్మిది నెలలపాటు తన గర్భంలో మోసింది. పురిటి నొప్పులు పడింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి కడుపులో నుంచి ఒడిపైకి చేరాల్సిన ఆ పసికందు.. ఓ ఫ్యాక్టరీ ప్రహరీ పక్కన ముళ్లపొదల్లోకి చేరింది. నేలపైకి వచ్చిన గంటల వ్యవధిలోనే ఆ బిడ్డను అలా వదిలేయడానికి వారికి చేతులెలా వచ్చాయో.. ఈ ఘటన సోమవారం నిండ్ర మండలం ఎంఎ్సవీఎం పురం పంచాయతీ అమ్మయప్పర్ కంపెనీ సమీపంలో చోటు చేసుకుంది. ఈ కంపెనీ ప్రహరీకి.. రోడ్డుకు మధ్య ముళ్లచెట్లలో ఉన్న పసికందును.. సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో మేకల కాపరులు గమనించారు. రోడ్డుపై ఉన్న వ్యక్తికి సమాచారం ఇచ్చారు. అనంతరం వీరు పోలీసులకు ఫోను చేశారు. సిబ్బందితో పాటు ఎస్ఐ, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బిడ్డ జన్మించి రెండు మూడు గంటలు అయి ఉండొచ్చని గుర్తించారు. అప్పుడే చీమలు చుట్టుకుంటున్నాయి. వెంటనే నిండ్రలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి పసికందును శుభ్రం చేశారు. నగరికి తీసుకెళ్లి వైద్యం అందించారు. అనంతరం చిత్తూరులోని శిశు సంక్షేమశాఖ హోమ్‌కు తరలించారు.
నేరం ఎవరిది?
ఏం జరిగింది? పసికందును ముళ్ల చెట్లలో వదిలేంత కష్టం ఏమొచ్చింది? తప్పయినా.. ఇంకేమైనా.. ఆ బిడ్డ జన్మకు కారకులైన వారు చేసిందే? నేరం వీళ్లు చేసి.. అభం శుభం తెలియని పసికందుకు శిక్ష వేస్తారా? మేకల కాపరులే గుర్తించకుంటే చీమలు కుట్టి.. ఆ పసికందు ఏమయ్యేదో? దీనావస్థలో పడున్న బిడ్డను చూసిన స్థానికులకేకళ్లలో నీళ్లొచ్చాయి. అలాంటిది, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి.. ఆమె కుటుంబానికి.. కారకుడైన వ్యక్తికి వదిలించుకోవడానికి ఎలా మనసొచ్చిందో?
- నిండ్ర, ఆంధ్రజ్యోతి