Share News

నామినీ ఉంటేనే బీమా

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:56 AM

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే దిశగా ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో రేషన్‌కార్డు కలిగిన లబ్ధిదారులు చేరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి రేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారులు 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారికి బీమా నమోదు చేస్తున్నారు. రేషన్‌ కార్డు కలిగి ఉండి, వయస్సు అర్హత ఉన్న ఒంటరి మహిళలు, పురుషులు, వితంతువులు బీమా పథకానికి దూరం అవుతున్నారు.

నామినీ ఉంటేనే బీమా

- వితంతు, ఒంటరి మహిళల్లో నిరాశ

(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే దిశగా ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో రేషన్‌కార్డు కలిగిన లబ్ధిదారులు చేరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి రేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారులు 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారికి బీమా నమోదు చేస్తున్నారు. రేషన్‌ కార్డు కలిగి ఉండి, వయస్సు అర్హత ఉన్న ఒంటరి మహిళలు, పురుషులు, వితంతువులు బీమా పథకానికి దూరం అవుతున్నారు. జిల్లాలో 20 వేల మంది వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం వారికి కుటుంబ సభ్యులు లేకపోవడంతో బీమా సొమ్ము నామినీ పేర్కొనే వీలు లేక పోవడంతో బీమా వర్తించడం లేదు. మరోవైపు వివిధ కారణాలతో కుటుంబ సభ్యులతో విడిపోయి ఒంటరిగా మిగిలిపోయిన మహిళలు, భార్య చనిపోయి పిల్లలు లేకుండా ఒంటరిగా జీవిస్తున్న వారు తమకు అండగా బాగోగులు చూస్తున్న వారిని నామినీగా చూపే అవకాశం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు పిల్లలు విడిపోయి ఎవరి రేషన్‌ కార్డు వారు పొందగా విడిగా కార్డు పొందిన తల్లి, తండ్రి కూడా బీమా పొందలేకపోతున్నారు. ఒంటరిగా ఉంటున్న వారికి కుటుంబం లేనివారికి, ఒకవేళ పిల్లలు ఉండి వేరే కార్డు ఉంటే అందులో వారికి బీమా వర్తిస్తుండడంతో బీమా వర్తించదనే వాదన వినిపిస్తోంది. కానీ ఒంటరిగా ఉంటున్న వారు గ్రామంలో తమకు అండగా బాగోగులు చూసుకుంటున్న వారిని నామినీగా చేర్చుకునే అవకాశం కల్పించి బీమా వర్తింపజేయాలని కోరుతున్నారు.

జిల్లాలో 40 శాతం నమోదు

రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల్లో ఒకరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో లబ్ధిదారులుగా నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం వరకు నమోదయ్యారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి కావడంతో రేషన్‌ లబ్ధిదారులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా నమోదు చేసుకుంటున్నారు. ఎలాంటి జిరాక్స్‌ ఆధార్‌ కార్డులు లేకుండా కేవలం రేషన్‌ కార్డు నెంబర్‌ నమోదు చేయడంతోనే రేషన్‌ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు రావడం అందులో లబ్ధిదారులు ఇష్ట ప్రకారం బీమా దారుడి పేరు, నామినీల వద్ద ఎవరికి ఎంత వాటా చెల్లించాలో నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే బీమాదారుడి మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. బీమా ప్రక్రియను కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో 1.97 లక్షల రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలు ఉండగా లబ్ధిదారులు 5 లక్షల 44వేల మంది ఉన్నారు. ఇందులో 59 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారిలో నామినీ మరొకరు ఉంటే ఒక కుటుంబానికి రూ. 5 లక్షల బీమా వర్తింపచేస్తున్నారు. రేషన్‌కార్డు ఉన్న వారిలో బోయిన్‌పల్లి మండలంలో 13,379 కుటుంబాలు ఉండగా, చందుర్తిలో 12,315, ఇల్లంతకుంటలో17,471, గంభీరావుపేటలో16,017, కోనరావుపేటలో15,778, ముస్తాబాద్‌లో 16,773, రుద్రంగిలో 5,597, సిరిసిల్లలో 30,756, తంగళ్లపల్లిలో 16,234, వీర్నపల్లిలో 4,842, వేములవాడ రూరల్‌లో 8,301, వేములవాడలో 22,409, ఎల్లారెడ్డిపేటలో 17,653 కుటుంబాల్లో అర్హులకు బీమా వర్తింపజేస్తున్నారు.

కార్డులు పేరు లేకపోయినా నామినీగా తీసుకోవాలి

- దయ్యాల స్వామి, ఇల్లంతకుంట

ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో కార్డులో పేరు లేకపోయినా ఎవరినైనా నామినీగా పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. నా భార్య చనిపోయింది. రేషన్‌ కార్డులో నా ఒక్కడి పేరు ఉంది. మాలాంటి వారికి జీవిత బీమా అందకపోవడం అన్యాయం చేసినట్లు అవుతుంది. ఎవరో ఒకరు మా బాగోగులు చూస్తున్నవారు ఉంటారు. వారిని నామినీగా చేర్చుకునే అవకాశం కల్పించారు.

కుటుంబ బీమా అవకాశం కల్పించాలి

- అన్నారం బాలలక్ష్మి, జంగంరెడ్డిపల్లి

రేషన్‌ కార్డులలో నామినీ పేరుకు అవకాశం లేదని ఆన్‌లైన్‌ చేయడం లేదు. నా భర్త చనిపోయినందున రేషన్‌ కార్డులో నా పేరు మాత్రమే మిగిలింది. దీంతో నామినీకి అవకాశం లేకపోవడంతో బీమా వర్తించడం లేదు. నాలాంటి వితంతువులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలయ్యేలా చూడాలి.

Updated Date - Nov 24 , 2026 | 12:56 AM