రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:09 AM
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై దాడి కేసులో నిందితుడు హేమంత్‌ను పోలీసులు శుక్రవారం కర్నూలుకు తరలించారు.
హేమంత్ ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో చిన్న గడ్డలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. చికిత్స కోసం కర్నూలుకు
అనంతపురం వైద్యం, కర్నూలు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై దాడి కేసులో నిందితుడు హేమంత్‌ను పోలీసులు శుక్రవారం కర్నూలుకు తరలించారు. అతను పల్మనరీ ఎంబాలిజం సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నెల 1న నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. బుల్లెట్ గాయాల కారణంగా కాలుకు రక్తప్రసరణ ఆగిపోవడం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్(గ్యాంగ్రీన్) సోకడంతో అతడి కుడి కాలును ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి డాక్టర్లు తొలగించారు. అప్పటి నుంచి వైద్యసేవలు కొనసాగిస్తున్నా, కోలుకోలేదు.
ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం(పల్మనరీ ఎంబాలిజం) వంటి తీవ్ర అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్నాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న హేమత్‌కు 10న చేసిన సీటీ స్కాన్ చేశారు. స్కాన్‌లో ఊపిరితిత్తులతో పాటు, రక్తనాళాల్లో సూక్ష్మమైన గడ్డలు ఉన్నట్లు తేలింది. దీనికి మెరుగైన వైద్యం అనంతపురంలో అందుబాటులో లేకపోవడంతో కర్నూలుకు తరలించాలని నిర్ణయించారు.
నిందితుడికి అనంతపురం జీజీహెచ్‌లో రిమాండ్ ఖైదీగానే వైద్యసేవలు అందించారు. ఈ నేపథ్యంలో కర్నూలుకు తరలించేందుకు ముందుగా అనంతపురం ఆస్పత్రి నుంచి రెడ్డిపల్లి జైలుకు తరలించారు. అక్కడ వివరాల నమోదు, తరలింపు ప్రక్రియను జైలర్ పర్యవేక్షణలో పూర్తి చేశారు. అనంతరం ఏఆర్ ఎస్కార్ట్ వాహనంలో సుమారు 10 మంది పోలీసుల భద్రతతో హేమంత్‌ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్