Share News

లిక్విడ్ రూపంలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

ABN , Publish Date - Aug 26 , 2026 | 08:38 PM

రాజమండ్రి పరిధిలో గంజాయి స్మగ్లర్లు కొత్త తరహా అక్రమ రవాణాకు తెరలేపారు. పోలీసుల నిఘాకు చిక్కకుండా గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి తరలిస్తున్న ముఠా గుట్టును గోకవరం పోలీసులు రట్టు చేశారు..

లిక్విడ్ రూపంలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
Rajahmundry Cannabis Smuggling

రాజమండ్రి, ఆగస్టు 26: నగర పరిధిలో ద్రవ రూపంలోకి మార్చిన గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును గోకవరం పోలీసులు రట్టు చేశారు. గంజాయిని సాధారణ రూపంలో కాకుండా ద్రవ రూపంలోకి మార్చి, ఎవరికీ అనుమానం రాకుండా రవాణా చేస్తున్న స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి సుమారు రూ.75 లక్షల విలువైన 6 కేజీల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టిన గోకవరం పోలీసులు అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించి ఈ ముఠాను పట్టుకున్నట్లు తెలుస్తోంది. నిందితులు ఉపయోగించిన కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వారి వద్ద ఉన్న మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని, వాటిలోని సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్ల ద్వారా ముఠాలోని ఇతర సభ్యులు, గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, కొనుగోలుదారుల వివరాలను పోలీసులు సేకరించే అవకాశం ఉంది.


లిక్విడ్ రూపంలో గంజాయి తరలింపు వెలుగులోకి రావడం పోలీసు వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. సాధారణంగా గంజాయిని ఎండిన ఆకులు, ప్యాకెట్ల రూపంలో తరలించే స్మగ్లర్లు.. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమవుతోంది. ద్రవ రూపంలో గంజాయిని తరలించడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులను విచారిస్తూ ఈ అక్రమ రవాణా వ్యవహారంలో వారి పాత్ర, గతంలో ఎక్కడెక్కడ గంజాయి తరలించారు, ఎవరికి సరఫరా చేశారు అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర

తెలంగాణ వేదికగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’

For AP News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 08:48 PM