Share News

శ్రీశైలంలో నిలిచిన విద్యుదుత్పత్తి

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:02 AM

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశాలను లెక్కచేయకుండా శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పాదనను కొనసాగించిన తెలంగాణ.. ఆదివారం మా త్రం నిలిపివేసింది. ఏపీ ఇంతకుముందే కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ఆపేసిన సంగతి తెలిసిందే.

శ్రీశైలంలో నిలిచిన విద్యుదుత్పత్తి

  • రిజర్వాయర్‌లో 868 అడుగుల నీటి నిల్వ

  • ఎగువ నుంచి ఆగిపోయిన ఇన్‌ఫ్లో

  • సాగర్‌ నుంచి కుడి, ఎడమ కాలువలకు నీరు

  • ప్రస్తుతం డ్యాంలో 179 టీఎంసీలు

శ్రీశైలం/విజయపురి సౌత్‌/అచ్చంపేట, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశాలను లెక్కచేయకుండా శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పాదనను కొనసాగించిన తెలంగాణ.. ఆదివారం మా త్రం నిలిపివేసింది. ఏపీ ఇంతకుముందే కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ఆపేసిన సంగతి తెలిసిందే. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 868.70 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 136.27 టీఎంసీలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద పూర్తిగా నిలిచిపోయింది. జూరాల ప్రాజెక్టు నుంచి ఆదివారం 4,495 క్యూసెక్కుల నీరు విడుదలైనప్పటికీ సాయంత్రం వరకు శ్రీశైలానికి చుక్క నీరు కూడా వచ్చి చేరలేదు. ఇంకోవైపు.. నాగార్జున సాగర్‌ డ్యాం నుంచి తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 6553 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అటు తెలంగాణలో ఎడమ కాలువకు 7518 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం గరిష్ఠ సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా.. ఆదివారం 179.69 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం నుంచి 16,371 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టులో 27.83 టీఎంసీలు ఉన్నాయి. లీకుల ద్వారా 400 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతోంది.

ఈ వార్తలను కూడా చదవండి

ధారకొండ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం

విరగ్గాసిన స్టార్‌ ఫ్రూట్స్‌

Updated Date - Sep 07 , 2026 | 05:02 AM