Share News

పండ్ల తోటలను కాపాడుకుందాం

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:00 AM

ఎల్‌నినో నేపథ్యంలో పండ్ల తోటలు, ఉద్యాన పంటల రక్షణకు ఉద్యానశాఖ ఐదంచెల ప్రణాళికను అమలు చేస్తోంది.

పండ్ల తోటలను కాపాడుకుందాం

  • ఎల్‌నినో నేపథ్యంలో ఉద్యానశాఖ ఐదంచెల ప్రణాళిక

  • సూక్ష్మనీటి వినియోగానికి ప్రోత్సాహం

  • రైతుసేవా కేంద్రాల స్థాయిలో కార్యాచరణ కమిటీలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో పండ్ల తోటలు, ఉద్యాన పంటల రక్షణకు ఉద్యానశాఖ ఐదంచెల ప్రణాళికను అమలు చేస్తోంది. ఎల్‌నినో పై వాతావరణశాఖ హెచ్చరించినప్పటి నుంచే ఉద్యానశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఆ వివరాలను ఉద్యానశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో నీటి వనరులు, భూగర్భ జలాలు, చెరువులు, ఇతర నీటి వనరుల డేటా ఆధారంగా 3,434 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉద్యాన పంటలకు ప్రమాదం పొంచి ఉందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా బత్తాయి(చీనీ), నిమ్మ, మామిడి, జీడిమామిడి, మిరప పంటలు ఎల్‌నినో వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని గుర్తించింది. రైతుసేవా కేంద్రాల్లోని ఉద్యాన సహాయకులు పరిశీలన చేయడం ద్వారా 29,615 ఎకరాల్లో మామిడి, 9,100 ఎకరాల్లో బత్తాయి, 1,530 ఎకరాల్లో నిమ్మ, ఇతర రకాలతో కలిపి మొత్తం 44,790 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే రైతన్నా మీకోసం-ఎల్‌నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికను ఉద్యానశాఖ కూడా ఈనెల నుంచి అమలు చేస్తోంది. రైతులు, భూభాగాల 100 శాతం కవరేజ్‌, పంట, నీటి ఒత్తిడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో నిర్ధారణ, తక్షణ చర్యలు, ఏపీఎయిమ్స్‌ 2.0 యాప్‌ ద్వారా డిజిటల్‌ పర్యవేక్షణ చేస్తోంది. రైతులకు సకాలంలో, అవసరమైన సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు రైతుసేవా కేంద్రాల స్థాయిలో కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ఉద్యాన విశ్వవిద్యాలయం అందించిన ప్రత్యామ్నాయ వ్యూహాలను రైతులకు వివరించింది.


సూక్ష్మ నీటి సేద్యం

అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపర్చి, సూక్ష్మసేద్యం(డ్రిప్‌, స్ర్పింక్లర్స్‌) ద్వారా చెట్లకు నీటి తడులు అందించడం, ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్న రైతుసేవా కేంద్రాల పరిధిలోని 58వేల హెక్టార్లకు సూక్ష్మనీటి సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇప్పటి వరకు 11 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటి సేద్యం విధానాన్ని అమలు చేశారు. అనవసరమైన నీటి పారుదల లేకుండా ఆటోమేషన్‌ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.

ఉద్యాన పంటలకూ బీమా

నోటిఫై చేసిన ఉద్యాన పంటలకు ప్రస్తుత ఖరీఫ్‌లో బీమా అమలు చేస్తున్నారు. గతేడాది ఖరీఫ్‌తో పోల్చితే ఈసారి ఉద్యాన పంటలకు బీమా నమోదు పెరిగింది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద గతేడాది 37,608 హెక్టార్లు నమోదవగా, ఈ సారి 1,50,844 హెక్టార్లు నమోదైంది. వాతావరణ ఆధారిత పంటల బీమా కింద గతేడాది సుమారు 9వేల హెక్టార్లు నమోదవగా, ఇప్పుడు 55,946 హెక్టార్లకు నమోదు పెరిగింది.


రైతు వారీగా నీటి కుంటలు

ఎల్‌నినో తీవ్ర ప్రభావం ఉన్న రైతుసేవాకేంద్రాల పరిధిలో 4,384 నీటి కుంటలను నిర్మిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటిని అందులో నిల్వ చేసి, దీర్ఘకాలిక నీటి ఎద్దడి పరిస్థితుల్లో పండ్ల తోటలకు లైఫ్‌ సేవింగ్‌ ఇరిగేషన్‌ అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 144 నీటికుంటలను ఏర్పాటు చేశారు.

వీడ్‌ మ్యాట్‌ మల్చింగ్‌ ఏర్పాటు

ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాల్లోని పండ్ల తోటల్లో నేల తేమను సంరక్షించడం కోసం కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే 6,866 హెక్టార్లలోని పండ్ల తోటల్లో వీడ్‌ మ్యాట్‌ను మల్చింగ్‌ చేస్తున్నారు.

ప్రీ-మాన్సూన్‌ డ్రై సోయింగ్‌

ముందస్తు రుతుపవన పొడి విత్తన(పీఎండీఎస్‌) విధానాన్ని ఉద్యాన పంటల్లోనూ అనుసరిస్తున్నారు. ఎల్‌నినో నేపథ్యంలో మిరప సాగును తగ్గించేలా రైతులకు అవగాహన కల్పిస్తూనే.. మిరప నాట్లు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో రైతుసాధికార సంస్థ సమన్వయంతో పీఎండీఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. మామిడి, నిమ్మ, బత్తాయి తదితర దీర్ఘకాలిక పంటల విషయంలోనూ ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఢిల్లీ-బిలాస్‌పూర్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ఈ ఇంటి కాంట్రాక్టర్‌కు దండం పెట్టొచ్చు..

Updated Date - Aug 29 , 2026 | 04:01 AM