రాధాకృష్ణను నువ్వేం చేస్తావు?
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:26 AM
బీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను బెదిరించాలనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది. రాధాకృష్ణను బెదిరించడం మీ తండ్రి(వైఎస్) వల్లే కాలేదు....
మీ తండ్రి, గురువు వల్లే కాలేదు.. ఏదో చేస్తాననుకుంటే అది నీ భ్రమే
నీకు (జగన్) ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉంది? ఆయన (రాధాకృష్ణ) డైరెక్ట్‌గా.. ‘నా చానల్ దమ్మున్న చానల్’ అని చెప్పుకొంటారు. ప్రజల కోసం మాట్లాడుతానని చెబుతారు. ఆయన అందరిపైనా రాస్తారు. ఎవరిని వదిలారు? చంద్రబాబు మీద రాయలేదా? ఈ ప్రభుత్వం వచ్చాక మా మీద రాయలేదా? దటీజ్ హిజ్ డ్యూటీ. ‘నేను నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పాలి.. చెప్పడమే నా ధర్మం’ అని నమ్మిన వ్యక్తి రాధాకృష్ణ. రాసినదాంట్లో నిజం ఉంటే సరిదిద్దుకోవాలి. లేదు.. అనుకుంటే రిజాయిండర్ ఇచ్చుకోవాలి. అది వదిలిపెట్టి చంపుతాం, నరుకుతాం, రప్పారప్పా అంటే.. ప్రజలే మిమ్మల్ని రప్పారప్పా అనే రోజులు త్వరలోనే వస్తాయి.
- మంత్రి పయ్యావుల కేశవ్
ఆయన అందరిపైనా రాస్తారు
మామీద, బాబు మీద రాయలేదా?
చంపుతాం, నరుకుతాం, రప్పారప్పా అంటే.. ప్రజలే మిమ్మల్ని రప్పారప్పా అంటారు
బొత్స అన్న మాటలనే అచ్చెన్నాయుడు చెబితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?: పయ్యావుల
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ‘‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను బెదిరించాలనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది. రాధాకృష్ణను బెదిరించడం మీ తండ్రి(వైఎస్) వల్లే కాలేదు. నీ రాజకీయ గురువు (కేసీఆర్) వల్ల కాలేదు. నీ వల్ల కాలేదు. ఏదో చేస్తాననుకుంటే అది నీ భ్రమే అవుతుంది. ఇలాంటి ఆలోచనలు మానుకో’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏబీఎన్‌పై కేసులు పెట్టారని, ప్రకటనలు ఇవ్వకుండా ఆపారని, చానల్ టెలికాస్ట్ కాకుండా చేశారని, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారని విమర్శించారు. అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని అన్నారు. ‘‘ఏబీఎన్ గురించి సీబీఎన్ గురించి ఇంకా జగన్‌కు సరిగ్గా తెలియదనిపిస్తోంది. రాజకీయాల్లో సీబీఎన్ ఎలాంటి వ్యక్తో ఒక్కసారి చూడండి. అభివృద్ధి, సంక్షేమం ఆయన విధానం. 40 ఏళ్లు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేశారు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నీ (జగన్) రాజకీయం. ఏబీఎన్‌ను ఈ రోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏంటి? మళ్లీ కొత్తగా ఏం చేస్తావ్. ఆయన (రాధాకృష్ణ) క్షేత్ర స్థాయి నుంచి కలం పట్టుకుని వచ్చిన వ్యక్తి. ప్రజలకోసం నిలబడిన వ్యక్తి. మేం అధికారంలో ఉన్నప్పుడు ‘చుక్కల్లో చంద్రుడా నేలకు దిగు’ అని రాశారు. ఆ రోజు చంద్రబాబు బాధపడలేదే? మా శాఖ గురించి కూడా రాస్తారు. ప్రపంచంలో జరిగేవన్ని మాకు తెలియాలని లేదు కదా? మీడియాకు పలు రకాలుగా సమాచారం వస్తుంది. అందులో నిజం ఉందా? లేదా? అని ఆలోచించాలి’’ అని పయ్యావుల అన్నారు.
బొత్స బాధ ఏంటంటే..
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గురించి మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినదాంట్లో అభ్యంతరం ఏముందని కేశవ్ అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయని ఆనాడు బొత్స చెప్పారు. దాన్నే అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయనేమీ కొత్తగా చెప్పలేదు కదా? మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు? బొత్స సత్యనారాయణ నిన్న బాధపడ్డారు. జగన్ నైజం చూసిన తర్వాత బొత్సకు భయం పుట్టినట్టు ఉంది. పరిటాల రవి హత్య కేసులో నిందితులు, సాక్షులు మిగలలేదు. బాబాయ్ హత్య కేసులో నిందితులు, సాక్షులలో సగంమంది లోకాన్ని వదిలిపోయారు. ఈ సీరియల్ నంబర్‌లో తన నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా? మర్చిపోయినవారినిమళ్లీ గుర్తుచేస్తున్నారని భయమేసి, దానినుంచి బాధ పుట్టుకొచ్చిందేమో!’’
జగన్‌ది పెత్తందారీ మనస్తత్వం
‘‘అధికారంలో ఉన్నా మేము ప్రజలకు కూలీలమని చెప్పుకొంటాం. మీది(జగన్) పెత్తందారీ మనస్తత్వం. మీరు బయటకు వెళితే ప్రజల్ని రప్పారప్పా నరుకుతాం అనే వ్యవస్థ మీది. ఇప్పుడు మీరు శాసనసభలో లేకుండా పోయారు. ప్రజల్లో కూడా లేకుండా పోతారు.’’ అని హెచ్చరించారు.
రాయలసీమ పేరుతో రాజకీయం
రాయలసీమ పేరును జగన్ కేవలం రాజకీయం కోసమే వాడుకుంటున్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రాయలసీమలోని ప్రాజెక్టును చంపేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘మీ (జగన్) ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారు? ఎక్కడైనా కాల్వల్లో గంప మట్టి తీశారా? ఒక మీటరు కాల్వ తవ్వారా? కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్‌ను కనీసం తిరిగి చూశారా? ఈ రోజు ఏదో రాయలసీమకు అన్యాయం జరిగిపోయిందని,సీమ లిప్ట్ ఆపేశారని చెబుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టును చంపిందే మీరు. 2021లో కోర్టులో స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్టును మళ్లీ మేం ఎలా ఆపుతాం? తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని అంటున్నారు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది తామేనని మీ పార్టీకి అలయెన్సు పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు సభలో చెప్పారు. మీ తండ్రి టైమ్‌లో రాయలసీమ పేరుతో యాత్రలు చేశారు. ఆ రోజు ఎన్టీఆర్ రాయలసీమ పట్ల ప్రేమ చూపిన నిజమైన వ్యక్తి. గాలేరు-నగరి, తెలుగు గంగ, హంద్రీ-నీవా ఎన్టీఆర్ కలల ప్రాజెక్టులు. మీరు రాయలసీమకు ఏం చేశారు? రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే ఎంత ఖర్చు చేశారో చర్చకు రావాలి.’’ అని సవాల్ విసిరారు.
ఇదీ జగన్ చరిత్ర
‘‘ఉదయం 6.15 గంటలకే బాబాయ్ గొడ్డలిపోటుతో చనిపోయారని తెలిస్తే..ఆయన (జగన్) టీవీలో గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసి.. వెంటనే వెళ్లడానికి వీలున్నా, సుదీర్ఘ ప్రయాణం చేసి 12 గంటలకు చేరుకున్నారు. అంటే..బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్టా? సాక్ష్యాధారాలన్నీ చెరిగిపోయేదాకా అక్కడికి చేరుకోకూడదనే ఆలోచన ఉన్నట్టా? జగన్ చరిత్ర చెబితే.. ప్రత్యర్థులపైచేసిన దాడులు చాలాఉన్నాయి. అచ్చెన్న సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు తిప్పారు. ఎస్‌ఈసీని రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రానికి పోయే పరిస్థితి కల్పించారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక మాట చెప్పారు. పరిటాల హత్య కేసులో జగన్‌ను కాపాడడానికి 60రోజులు కష్టపడ్డానని చెప్పారు. కష్టపడ్డాను అంటే.. ఏంటీ? ఇది కిరణ్ చెప్పాలి. కోడి కత్తి, గులకరాయి, తండ్రి మరణం, బాబాయి గొడ్డలిపోటు..ఇలా దేన్నైనా సింపతీగా మల్చుకోవడంలో జగన్ దిట్ట. ఒక సంఘటన జరుగుతుంది. చేయించేది జగనే. బాధితుడిగా నటించేది ఆయనే. సమాజానికి వైసీపీ హానికరం’’ అని కేశవ్ మండిపడ్డారు.