పోటీ చేసేవారిని అడ్డుకోవద్దు!
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:12 AM
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగేవని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
మున్సిపల్, పరిషత్‌ల మాదిరిగా పంచాయతీల్లో సీట్ల పంపకాలు ఉండవు: జనసేనాని పవన్
అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగేవని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పోటీ చేసే అభ్యర్థులను అడ్డుకోవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ.. నామినేషన్ వేసి పోటీ చేసే హక్కు ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చన్నారు. వారిని పార్టీ నాయకులెవరూ అడ్డుకోరాదని స్పష్టంచేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు ఉండవని తేల్చిచెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి.. సమస్యలను పరిష్కరించేలా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ.. అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి పని చేస్తారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని పవన్ ఆదేశించారు. మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో కూటమి పక్షాలు సాధించిన అఖండ విజయం స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పిలుపిచ్చారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం మధ్యాహ్నం ఆయన సమీక్షించారు. 26వ తేదీన జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు జనసేన శ్రేణులు, నాయకులు, సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. మూడు విడతల్లోనూ ఎన్నికలు సామరస్యంగా జరిగేలా చూడాలని ఆయన చెప్పారు. కూటమి పక్షాల ఐక్యతకు ఈ ఎన్నికలు నిదర్శనంగా ఉండాలన్నారు.
జోన్లవారీగా హెల్ప్ డెస్క్‌లు..
జోన్-1లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఉంటాయి. ఈ జిల్లాలకు సుందరపు విజయ్‌కుమార్, వంశీకృష్ణ యాదవ్, పెద్దిశెట్టి ఉషశ్రీ, గుర్రాన, అయ్యలు, తుమి లక్ష్మీరాజ్, కోరికాన రవికుమార్, జీకే వసంతలను హెల్ప్ డెస్క్ కమిటీ సభ్యులుగా నియమించారు.
జోన్-2లో తూర్పుగోదావరి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు ఉంటాయి. ఈ జిల్లాలకు బొలిశెట్టి శ్రీనివాస్, గంటా స్వరూప, యాళ్ల నాగ సతీశ్, బార్లపూడి క్రాంతి, ఘంటసాల వెంకటలక్ష్మి నియమితులయ్యారు.
జోన్-3లో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. సామినేని ఉదయభాను, మండలి రాజా, శివ పార్వతి, బడే కోమలి, రాయపాటి అరుణలను ఈ జిల్లాలకు నియమించారు.
జోన్-4లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు నాగరత్నం యాదవ్, ఆకేపాటి సుభాషిణి, సుంకర శ్రీనివాస్, అతికారి కృష్ణ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
జోన్-5లో నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు నవీన్ నిశ్చిల్, టి.సి.వరుణ్, రేఖాగౌడ్, రాంపుల్లారెడ్డిలను నియమించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు