Share News

పట్టిసీమతో 50 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా: దేవినేని ఉమ

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:16 PM

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రైతులు పండించిన ప్రతి పంట చేతికొచ్చి వారి ఇళ్లకు చేరాలని కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

పట్టిసీమతో 50 లక్షల ఎకరాలకు సాగునీటి భరోసా: దేవినేని ఉమ
Devineni Uma

విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు పండించిన ప్రతి పంట చేతికొచ్చి వారి ఇళ్లకు చేరాలని కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు సాగు చేసిన ప్రతి పంట సమృద్ధిగా పండాలని.. రాష్ట్రంలో వ్యవసాయం బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

గత 22 సంవత్సరాలుగా కాలినడకన భక్తులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈసారి కూడా సామాన్య భక్తులతో కలిసి ఉచిత దర్శనం క్యూలైన్‌లో సుమారు నాలుగున్నర గంటల పాటు వేచి ఉండి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని దేవినేని ఉమ సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించాలని.. ముఖ్యంగా సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, రద్దీని దృష్టిలో పెట్టుకుని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.


రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రార్థన..

రాష్ట్రంలో రైతాంగం అభివృద్ధి చెందాలని.. సాగునీటి కొరత లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని దేవినేని ఉమ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సుమారు 50 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. సాగునీటి అవసరాలను తీర్చడంలో ఇలాంటి ప్రాజెక్టుల ప్రాధాన్యం ఎంతో ఉందని, రైతులకు నీటి భద్రత కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందకుండా, వారు సాగు చేసిన పంటలు సురక్షితంగా చేతికొచ్చి మంచి దిగుబడులు సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...

అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 04:24 PM