పాకల తీరంలో పెను విషాదం..
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:58 AM
సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వచ్చిన వారిపై రాకాసి అల విరుచుకుపడింది. తొమ్మిదిమంది సముద్రంలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న మత్స్యకారులు సకాలంలో స్పందించి ఆరుగురిని ఒడ్డుకు తీసుకువచ్చారు.
రాకాసి అల ఉధృతికి కొట్టుకుపోయిన తొమ్మిది మంది
ఆరుగురిని ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు
వారిలో నలుగురికి తీవ్ర అస్వస్థత
చికిత్స పొందుతూ ఒకరు మృతి
మెరుగైన వైద్యం కోసం ఇద్దరు ఒంగోలుకు తరలింపు
ఒడ్డుకు కొట్టుకొచ్చిన యువకుడి మృతదేహం
లభించని మరో ఇద్దరి ఆచూకీ
సింగరాయకొండ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వచ్చిన వారిపై రాకాసి అల విరుచుకుపడింది. తొమ్మిదిమంది సముద్రంలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న మత్స్యకారులు సకాలంలో స్పందించి ఆరుగురిని ఒడ్డుకు తీసుకువచ్చారు. వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై మరణించగా, కొట్టుకుపోయిన ముగ్గురిలో ఒక యువకుడి మృతదేహం ఒడ్డుకు చేరింది. బాధితులంతా రక్తసంబంధీకులే. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగపురం ఇరిగినేని కాలనీకి చెందిన వారు సరదాగా గడపడానికి శనివారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరానికి వచ్చారు. సుమారు 20 మంది కేరింతలు కొడుతూ సముద్రంలో ఆటలాడుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా రాకాసి అల (కడస) ఉధృతికి తొమ్మిది మంది కొట్టుకుపోయారు. గమనించిన ఒడ్డున ఉన్న మత్స్యకారులు నలుగురు ఈత కొట్టుకుంటూ మరికొందరు బోటు తీసుకొని సముద్రంలోకి వెళ్లారు. అలల ఉధృతికి లోపలికి కొట్టుకుని వెళ్తున్న ఆరుగురిని రక్షించి బోటులో ఒడ్డుకు చేర్చారు. అందులో దేవండ్ల ప్రసాద్, దేవండ్ల రాజా సురక్షితంగా బయటపడ్డారు. నీటమునిగి తీవ్ర అస్వస్థతకు గురైన బత్తుల మనోజ్, బత్తుల మహేశ్‌బాబు, బండారు తేజ, బత్తుల నరసింహానికి మత్స్యకారులు, మెరైన్ పోలీసులు సీపీఆర్ చేశారు. అనంతరం వారిని 108లో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బత్తుల మహేశ్‌బాబు(22) మృతిచెందాడు. బత్తుల మనోజ్, బండారు తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. గల్లంతైన పాలడుగు తేజ(20) మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దేవండ్ల ప్రసాద్ కుమారుడు దేవండ్ల విష్లు(17), దేవండ్ల నారాయణ(25) సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం మత్స్యకారులు, మెరైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సరదాగా గడపడానికి వచ్చిన తమ ఇంట విషాదం నెలకొనడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకొని కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పాకల తీరానికి హుటాహుటిన చేరుకున్నారు. మృతుల బంధువులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!