Share News

ఏపీ సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ భేటీ.. ఇంధన రంగ విస్తరణపై చర్చలు

ABN , Publish Date - Jun 03 , 2026 | 07:19 PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో చమురు, సహజవాయువు సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ సమావేశమయ్యారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ భేటీ.. ఇంధన రంగ విస్తరణపై చర్చలు
CM Chandrababu Naidu

అమరావాతి, జూన్ 03: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చమురు, సహజవాయువు సంస్థ (ONGC) చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ మర్యాదపూర్వక సమావేశమయ్యారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో ఓఎన్‌జీసీ నిర్వహిస్తున్న ప్రస్తుత ప్రాజెక్టులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలతో పాటు రాష్ట్రంలో ఇంధన రంగ అభివృద్ధిపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (KG) డెల్టా బేసిన్‌లో జరుగుతున్న సహజవాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అరుణ్ కుమార్ సింగ్ వివరించారు.

రాష్ట్రంలో ఇంధన భద్రతను పెంపొందించడానికి, విద్యుత్ తదితర రంగాల అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. రాష్ట్ర ప్రగతిలో ఇంధన భద్రత అత్యంత కీలకమని, అందుకే ఓఎన్‌జీసీ ప్రాజెక్టులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు, ఓఎన్‌జీసీకి మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండేలా చూసుకోవాలని, తద్వారా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి వీలవుతుందని సీఎం సూచించారు.


ఈ భారీ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి సమకూరే ఆదాయం, స్థానిక యువతకు లభించే ఉపాధి అవకాశాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఓఎన్‌జీసీ కార్యకలాపాలు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో, చమురు, సహజవాయువు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు. సంస్థకు ఉన్న కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను ఆయా మైనింగ్ పరిసర గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలని సీఎం సూచించారు.

ముఖ్యమంత్రి చేసిన సూచనలపై ఓఎన్‌జీసీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. స్థానిక ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి తమ సంస్థ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెబుతూ, ఇప్పటికే సామాజిక బాధ్యత నిధులతో కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత అధునాతన వైద్య యంత్రాలను సమకూరుస్తున్నట్లు అరుణ్ కుమార్ సింగ్ వివరించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు, స్థానిక ప్రాంతాల సామాజిక ప్రగతికి కూడా ఓఎన్‌జీసీ కట్టుబడి ఉంటుందని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది.


ఇవి కూడా చదవండి..

పెండింగ్‌‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

Updated Date - Jun 03 , 2026 | 09:41 PM