పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:25 PM
పెండింగ్ రహదారుల పనులు ప్రారంభించటంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. రూ.439 కోట్లతో 400 కిలోమీటర్ల మేర గోదావరి పుష్కర పనులు చేపట్టామన్నారు.
అమరావతి, జూన్ 3: రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. రూ.750 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.13 అసంపూర్ణ వంతెనలను పూర్తిచేసేందుకు ప్రత్యేక నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో PPP మోడల్‌లో భారీ రహదారి ప్రాజెక్టులు అమలు చేస్తున్నామన్నారు. 405 కి.మీ మేర రూ.2506 కోట్లతో పీపీపీ విధానంలో 6 ప్రాజెక్టులు చేపట్టినట్లు చెప్పారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆధునిక ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. రోడ్ల డ్యామేజ్ గుర్తింపునకు డిజిటల్ డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రహదారుల నాణ్యత పెంచేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లు మన్నే రోడ్లు 7-8 ఏళ్లు నిలిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాతీయ రహదారుల విస్తరణలో ఏపీ.. దేశంలో ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందన్నారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ తర్వాత అత్యధిక రహదారి పనులు ఏపీలోనే జరుగుతున్నాయని తెలిపారు. రూ.7,784 కోట్లతో కొత్త రహదారి ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని.. మరో రూ.30,780 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. రూ.18 వేల కోట్లతో 79 కొత్త ప్రాజెక్టులకు సిద్ధం అవుతున్నామన్నారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని బీసీ జనార్దన్ అన్నారు. కుప్పం, శ్రీకాకుళం, అమరావతి సహా నాలుగు విమామాశ్రయాలు కొత్తగా తీసుకొస్తున్నామని తెలిపారు. పోర్టుల అభివృద్ధితో రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో రాష్ట్ర ప్రగతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన వల్ల రాష్ట్రంలో రోడ్లు వేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. పనులు లేక బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. మళ్లీ వస్తే అదే అరాచకం చేస్తామంటూ గొడ్డలి పార్టీ మాట్లాడుతోందని మండిపడ్డారు. గత రెండేళ్లలో రూ.3 వేల కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పెండింగ్ రహదారుల పనులు ప్రారంభించటంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రూ.439 కోట్లతో 400 కిలోమీటర్ల మేర గోదావరి పుష్కర పనులు చేపట్టామన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పాటు కొత్త టెక్నాలజీతో రోడ్లు వేస్తూ మెయింటెనెన్స్ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలు తీసుకునేలా చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తురాలి మృతి
ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News