ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:41 AM
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్‌ను పరిశీలించారు.
అమరావతి, జూన్ 3: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ ఈరోజు(బుధవారం) పర్యటించారు. ఈ సందర్భంగా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్‌ను పరిశీలించారు. రాజధాని రోడ్డుల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలలో వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణం జరుగుతున్న వంతెనల క్రింది భాగంలో మట్టి పూడిక తీతలు త్వరగా తొలగించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మావిగాన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మావిగాన్ వ్యాఖ్యల పట్ల చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారన్నారు. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందని.. అమరావతి ఆదాయం అన్ని జిల్లాలకు పంచుతారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలని.. జగన్‌కు లేదంటూ వ్యాఖ్యానించారు. రైతులను ల్యాండ్ పూలింగ్‌కు రావాలని మరోసారి కోరుతున్నట్లు తెలిపారు. రైతుల దగ్గర బలవంతంగా తీసుకోకూడదనే ఇప్పటి వరకు ల్యాండ్ అక్విజేషన్‌కు వెళ్లలేదన్నారు. 2028 ఆగస్టు నాటికి రాజధాని దాదాపు సిద్ధం అవుతుందని స్పష్టం చేశారు. నేటికి నయా రాయపూర్ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. జగన్ డేటా తీసుకుని మాట్లాడాలని హితవుపలికారు.
అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. వర్షాకాలం వచ్చేలోగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. గత వర్షాకాలం పశ్చిమ బైపాస్ కింద వాగులు పూడిపోవడంతో వాటర్ వెనక్కి తన్నిందని.. వెస్టర్న్ బైపాస్ దగ్గర 2 బ్రిడ్జి పనులు జరుగుతుండగా మరో 69 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతాయన్నారు. వెస్టర్న్ బైపాస్ వద్ద వెంట్స్‌ను పదిరోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పారు. అమరావతి వాటర్ ఫ్లో కోసం నెదర్లాండ్స్ వాళ్లతో మాట్లాడి డిజైన్ చేశామన్నారు. పనులు జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని వెల్లడించారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మాత్రమే ఇబ్బందులు ఉంటాయని.. తరువాత 69 బ్రిడ్జిలు పూర్తి అవుతాయని తెలిపారు.
200 సంవత్సరాల చరిత్ర తీసుకొని గ్రావిటీ కెనాల్‌లను ఏర్పాటు చేసినట్లు నారాయణ తెలిపారు. గత సంవత్సరం వెస్టర్న్ బైపాస్‌ను కడుతూ ప్రవాహం పూడ్చేశారని.. దీంతో అక్కడ పూడిక ఏర్పడిందన్నారు. ఈసారి అలాంటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. 494 ఎకరాలకు మాత్రమే ఇంకా ప్లాట్‌లు కేటాయించలేదని.. అక్కడ న్యాయపరమైన చిక్కులు, వారసత్వ ఇబ్బందులు ఉన్నాయన్నారు. లాటరీకి సిద్ధంగా 144 ఎకరాలు 74 మంది రైతులు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు 35,057 ఎకరాలు తీసుకున్నామని.. ఇందులో రిటర్నబుల్ ప్లాట్‌లు ఇవాల్సింది 498 ఎకరాలు మాత్రమే అని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఢీ జోడి డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తురాలి మృతి
Read Latest AP News And Telugu News