ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఈదురుగాలుల బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షాలు..
ABN , Publish Date - May 25 , 2026 | 09:28 PM
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ జిల్లా, మే 25: జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. ప్రధానంగా మైలవరం మండలంలోని పొందుగల, పుల్లూరు, చండ్రగూడెం తదితర గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సం కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రచండ గాలుల ప్రభావం విద్యుత్ శాఖపై తీవ్రంగా పడింది. పొందుగల గ్రామంలో పలు కరెంటు స్తంభాలు నేలకొరగడంతో పాటూ ప్రధాన సరఫరా లైన్లు తెగిపడ్డాయి. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.
మరోవైపు.. ఇళ్లపై ఉన్న రేకులు గాల్లోకి కొట్టుకుపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పొందుగల గ్రామంలో ఇళ్లపై నుంచి ఎగిరివచ్చిన రేకులు మీద పడటంతో లోక్య రమేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పలు నివాస గృహాలపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. బాడవ సమీపంతో పాటు మైలవరం తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లు సైతం గాలుల ధాటికి కుప్పకూలి రోడ్లపై పడ్డాయి. ఈ విపత్తు కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జగదల్‌పూర్ - ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై భారీ వృక్షాలు, హోర్డింగ్‌లు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తల్లిదండ్రులకు ప్రాణహాని అనంత శ్రీరామ్ ఆందోళన.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు
చిరంజీవి నివాసానికి టాలీవుడ్ ప్రముఖులు.. పర్సంటేజ్‌పై చర్చ..
Read Latest AP News