Share News

ఆధార్‌ ఆప్షనల్‌ మాత్రమే

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:17 AM

మీ సేవ ద్వారా అందించే రాష్ట్ర ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్‌ ధ్రువీకరణ స్వచ్ఛందం మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌ ఆధారిత ధృవీకరణ విఫలమైనా, ఆధార్‌ ఇవ్వడానికి దరఖాస్తుదారు నిరాకరించినా ఎలాంటి ప్రభుత్వ సేవ లేదా ప్రయోజనాన్ని నిరాకరించకూడదని స్పష్టం చేసింది.

ఆధార్‌ ఆప్షనల్‌ మాత్రమే

  • అది లేదని 246 ప్రభుత్వ సేవలను నిరాకరించకూడదు

  • సర్కారు ఉత్తర్వులు

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మీ సేవ ద్వారా అందించే రాష్ట్ర ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్‌ ధ్రువీకరణ స్వచ్ఛందం మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌ ఆధారిత ధృవీకరణ విఫలమైనా, ఆధార్‌ ఇవ్వడానికి దరఖాస్తుదారు నిరాకరించినా ఎలాంటి ప్రభుత్వ సేవ లేదా ప్రయోజనాన్ని నిరాకరించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు స్వర్ణగ్రామం-స్వర్ణవార్డు శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దివ్యాంగుల వైకల్య నిర్ధారణ, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం జారీతో సహా మీ సేవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 246 సేవలను పొందే సమయంలో దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించేందుకు ఎస్‌/నో ఆధార్‌ అథంటికేషన్‌ లేదా ఈకేవైసీని స్వచ్ఛందంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విధానం మీసేవ మొబైల్‌, వెబ్‌ అప్లికేషన్లలో అమలు చేయనున్నారు. ‘ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర గుర్తింపు ధ్రువీకరణ విధానం అందుబాటులో ఉందని దరఖాస్తుదారులకు ముందుగానే తెలియజేయాలి. ఆధార్‌ నంబరు, సంబంధిత సమాచారాన్ని సేకరించే ముందు దరఖాస్తుదారుడికి తెలిపి సమ్మతి తీసుకోవాలి. ఆధార్‌ ఎందుకు తీసుకుంటున్నారు? ఎలా సేకరిస్తారు? ఎక్కడ భద్రపరుస్తారు? ఏ విధంగా ఉపయోగిస్తారు? అనే వివరాలను స్పష్టంగా తెలియజేయాలి. సదరం వ్యవస్థలో ఆధార్‌ నంబరును పూర్తిగా ప్రదర్శించకూడదు. ఆధార్‌ నంబరును నిల్వ చేస్తే యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఎన్‌క్రిప్టెడ్‌ ఆధార్‌ డేటా వాల్ట్‌లో భద్రపరచాలి.


దానిని ఇతర వ్యవస్థలకు పంపడం లేదా పంచుకోవడం కూడా ఎన్‌క్రిప్టెడ్‌ విధానంలోనే జరగాలి. ఈ-కేవైసీ ద్వారా పొందిన వ్యక్తిగత వివరాలన్నింటినీ స్ర్కీన్‌పై ప్రదర్శించకూడదు. లబ్ధిదారుల బయోమెట్రిక్‌ ఆధారిత ధ్రువీకరణను కేవలం నియంత్రిత వాతావరణంలో మాత్రమే నిర్వహించాలి. అవసరమైన చోట ఐరిస్‌ ఆధారిత ధ్రువీకరణను ప్రోత్సహించవచ్చు. సదరం అప్లికేషన్‌ను సీఈఆర్‌టీ-ఇన్‌ ఎంప్యానెల్‌ చేసిన ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఆడిటర్‌తో ఆడిట్‌ చేయించి, ఆ నివేదికను యూఐడీఏఐకి సమర్పించాలి. యూఐడీఏఐ నుంచి వచ్చే తదుపరి సూచనలను కూడా అమలు చేయాలి’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 03:17 AM