Share News

పునరావాసంలో కొత్త కోరిక

ABN , Publish Date - Sep 10 , 2026 | 03:25 AM

‘ఆరేళ్ల క్రితం పరిహారం చెల్లిస్తామంటే ఇంటి స్థలం అక్కరలేదని చెప్పాం. వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరించాం. కానీ ఇప్పుడు (2026లో) పరిహారం ఇచ్చి మీకు ఇక ఇంటి పట్టా లేదని, ఆ రోజు మీరు ఒప్పుకున్నదే కదా అని అధికారులు అంటు న్నారు. అలా అయితే మాకు పునరావాసం ఎలా’ అని వెలిగొండ నిర్వాసితులు కొందరు ప్రశ్నిస్తున్నారు.

పునరావాసంలో కొత్త కోరిక
టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబుకు సమస్యను చెప్తున్న నిర్వాసితులు

ఇంటి పట్టా కోరుతున్న వెలిగొండ నిర్వాసితులు

2020లో నగదు ఇస్తామంటే ఓటీఎస్‌కు ఒప్పుకున్నాం

ఇప్పుడు చెల్లించడంతో నష్టపోతున్నాం

ఇచ్చిన పరిహారంలో అదనపు నగదు తిరిగి చెల్లిస్తాం

మాకు కూడా నివేశన స్థలం ఇవ్వాలంటూ విజ్ఞప్తి

‘ఆరేళ్ల క్రితం పరిహారం చెల్లిస్తామంటే ఇంటి స్థలం అక్కరలేదని చెప్పాం. వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరించాం. కానీ ఇప్పుడు (2026లో) పరిహారం ఇచ్చి మీకు ఇక ఇంటి పట్టా లేదని, ఆ రోజు మీరు ఒప్పుకున్నదే కదా అని అధికారులు అంటు న్నారు. అలా అయితే మాకు పునరావాసం ఎలా’ అని వెలిగొండ నిర్వాసితులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజే ఇచ్చి ఉంటే అప్పట్లో స్థలాల రేట్లు తక్కువగా ఉన్నందున ఏదో ఒకవిధంగా గూడు ఏర్పాటు చేసు కునే వాళ్లమని, ఇన్నాళ్ల తరువాత తమకు పరిహారం కింద చెల్లించిన డబ్బుతో ఎక్కడా స్థలం రాదంటున్నారు. ఇంటి పట్టాలేని పరిహారం మాకెందుకని వాపోతున్నారు. ఇదే విషయాన్ని బుధవారం కలెక్టరేట్‌లో నిర్వాసితులు అధికారులకు విన్నవించుకున్నారు. అక్కడకు వచ్చిన టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు వద్ద గోడు వెల్లబోసుకున్నారు.

మార్కాపురం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఓసీ, బీసీలకు రూ.11.76 లక్షలు. ఎస్సీలకు రూ.12.76 లక్షలు, ఎస్టీలకు రూ.13.01 లక్షలు. వీటితోపాటు పునరావాస కాలనీల్లో ఇంటి స్థలం ఇస్తున్నారు. అయితే 2020లో ఎవరైనా తమకు ఇంటి స్థలం అక్కరలేదని వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ఇష్టపడితే వారికి తక్షణమే రూ.12.50 లక్షలు ఇస్తామని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చెప్పింది. వెంటనే నగదు చెల్లిస్తారన్న ఉద్దేశంతో కొంతమంది వన్‌టైం సెటిల్‌మెంట్‌కు అంగీకరించారు. కానీ వారికి ఆ నగదు ఇవ్వకుండా వైసీపీ పాలనలో ఐదేళ్లూ కాలయాపన జరిగింది. ఆ తరువాత ఓటీఎస్‌ అడిగిన వారంతా మళ్లీ అధికారుల చుట్టూ తిరుగుతూ తమకు చెప్పిన సమయానికి నగదు ఇవ్వలేదు కాబట్టి అందరిలాగే మాకు కూడా ఆర్‌అండ్‌ఆర్‌ వర్తింపజేయాలని కోరుతూ వచ్చారు. కానీ ఇది అమలు కాలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల సమయంలో ముందుగా కుదిరిన ఇప్పందం ప్రకారం ఓటీఎస్‌ వాళ్లకు రూ.12.50 లక్షలు జమయ్యాయి. వారికి ఇంటి స్థలం లేదని అధికారులు చెప్పేశారు. తమకు అన్యాయం చేయవద్దని ఆరేళ్ల తరువాత పరిహారం ఇస్తామంటే మేము అంగీకరించే వాళ్లం కాదని ఇప్పుడు వారు అంటున్నారు. ఈ విధంగా దాదాపు 100 మందిలోపే ఉంటారని, ఈ సమస్య పరిష్కరించి తమకు ఆర్‌అండ్‌ఆర్‌ వర్తింపజేసి నివేశ స్థల పట్టా ఇస్తే ఇంటి నిర్మాణం చేసుకుంటామని వారు కోరుతున్నారు.

అదనపు నగదు తిరిగి ఇవ్వాలంటే..

ఓటీఎస్‌ వారికి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం రూ.12.50 లక్షలు. ఆర్‌అండ్‌ఆర్‌లో ఓసీ, బీసీలకు రూ. 11.76 లక్షలు చెల్లించి ఇంటి పట్టా ఇచ్చారు. ఆ ప్రకారం చూస్తే ఓటీఎస్‌కు అంగీకరించిన ఓసీ, బీసీలు కూడా రూ.11.76 లక్షలు పోను మిగిలిన 74 వేలు తిరిగి వెనక్కి ప్రభుత్వానికి చెల్లిస్తామని, ఇంటి పట్టా ఇవ్వాలని కోరుతున్నారు. ఆ విధంగా చేస్తే ఎస్సీలకు ఆర్‌అండ్‌ఆర్‌లో రూ.12.76 లక్షలు ఇస్తుండగా ఓటీఎస్‌లో తీసుకున్న రూ.12.50లక్షలు పోను మిగిలిన రూ.26వేలు ప్రభుత్వం చెల్లించి ఇంటి పట్టా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎస్టీలకు ఆర్‌అండ్‌ఆర్‌లో రూ.13.01 లక్షలు ఇస్తుండగా ఓటీఎస్‌ రూ.12.50లక్షలు పోను మిగిలిన 51వేలు ప్రభుత్వం చెల్లించి ఇంటి పట్టా ఇవ్వాలి. ఇలాంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలపై చర్చించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Sep 10 , 2026 | 03:25 AM