Share News

రాజధానికి కొత్తశోభ

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:21 AM

నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణం నగిషీలు అద్దుకుంటూ దూసుకుపోతోంది. నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటికి.. చెప్పుకోదగ్గ మార్పుతో నవనగర నిర్మాణం ఎప్పటికప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. మొన్నటి వరకు మట్టితో, గుంతలతో ఉన్న రాజధాని రహదారులు ఇప్పుడు తారురోడ్లుగా మారిపోతున్నాయి.

రాజధానికి కొత్తశోభ

  • అమరావతి రహదారులకు నగిషీలు

  • 700 కి.మీ. మేర వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లు

  • నిర్మాణం పూర్తయిన రోడ్లలో పనులు ప్రారంభం

  • ఈ3, ఎన్‌9, ఈ9, ఈ6

  • రోడ్లు, జోన్‌ 2ఏలో నిర్మాణం

  • అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా కొత్త హంగులు

  • రోడ్డు, ట్రాక్‌లకు మధ్య అవెన్యూ ప్లాంటేషన్‌

గుంటూరు(రాజధాని), సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణం నగిషీలు అద్దుకుంటూ దూసుకుపోతోంది. నిన్నటి నుంచి నేటికి, నేటి నుంచి రేపటికి.. చెప్పుకోదగ్గ మార్పుతో నవనగర నిర్మాణం ఎప్పటికప్పుడు కొత్త రూపు దిద్దుకుంటోంది. మొన్నటి వరకు మట్టితో, గుంతలతో ఉన్న రాజధాని రహదారులు ఇప్పుడు తారురోడ్లుగా మారిపోతున్నాయి. ఆ వెనువెంటనే వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. రాజధాని నగరంలో తూర్పు-పడమరలను కలుపుతూ ఈ 1 నుంచి ఈ 16 వరకూ 16 ‘ఈ’ సిరీస్‌ రోడ్లు, ఉత్తర-దక్షిణాలను కలుపుతూ ఎన్‌ 1 నుంచి ఎన్‌ 17 వరకూ 17 ‘ఎన్‌’ సిరీస్‌ రోడ్లు నిర్మిస్తున్నారు. వీటి మొత్తం పొడవు 350 కి.మీ. ఉంటుంది. ఈ రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో మొక్కలను పెంచడంతో పాటు స్థానిక ప్రజల అవసరాల నిమిత్తం వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లను నిర్మిస్తారు. అమరావతి మొత్తం మీద రోడ్లకు ఇరువైపులా 700 కి.మీ.ల మేర సైక్లింగ్‌ ట్రాక్‌లు, 700 కి.మీ. మేర వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మించనున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతున్న నేపథ్యంలో ట్రాక్‌ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.


అమరావతికే ప్రత్యేకం..

దేశంలో మరే నగరానికి లేని విధంగా అమరావతిలోని ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకంతో పాటు సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. భవిష్యత్‌ నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతికి ఈ సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రోడ్లకు ఇరువైపులా పెంచే మొక్కలు గ్రీన్‌ సిటీ లక్ష్యాన్ని పరిపూర్తి చేయనున్నాయి. ప్రస్తుతం 4 రోడ్లలో ట్రాక్‌ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇటీవల పూర్తయిన సీడ్‌ యాక్సె్‌స(ఈ 3) రోడ్డులో రాయపూడి వద్ద వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు మొదలయ్యాయి. దీంతో పాటు ‘ఈ’ సిరీస్‌ రోడ్లలో ఈ 6 రోడ్డు, ఈ 9 రోడ్డులో కూడా పనులు మొదలయ్యాయి. ‘ఎన్‌’ సిరీస్‌ రోడ్లలో ఎన్‌ 9 రోడ్డులో ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోంది. దాదాపు 3 మీటర్ల వెడల్పుతో సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. మరో 3 మీటర్ల వెడల్పుతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. ఇక్కడ సైక్లింగ్‌ ట్రాక్‌కు రంగులు వేయడంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. మొత్తం అమరావతిలో రహదారులు పూర్తై సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లు అందుబాటులోకి వస్తే నవనగరం మరింత శోభాయమానంగా కనిపిస్తుందని రాజధానివాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 05:21 AM