Share News

వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే: మంత్రి నారాయణ

ABN , Publish Date - Jul 05 , 2026 | 09:21 PM

నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన‌ ప్రస్థానంపై రచించిన‌ వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే: మంత్రి నారాయణ

నెల్లూరు, జులై 05: తన అభ్యర్థనతో ఆంధ్రప్రదేశ్‌కు 7 లక్షల టిడ్కో ఇళ్లు కేటాయించిన గొప్ప నేత భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అని మున్సిపల్ శాఖ మంత్రి పి.‌ నారాయణ తెలిపారు. వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. ఆయనకు ఉన్న అపారమైన అనుభవంతో రాజ్యసభలో ఎన్నో కీలక బిల్లులు పాస్ చేయించారని వివరించారు.

ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. ఆయన నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేసుకున్నారు. ఆదివారం నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవన‌ ప్రస్థానంపై రచించిన‌ వెంకయ్య 'నాయకుడు' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


పదవులకే ఆయన అలంకారం: ఎంపీ మాగుంట

వెంకయ్యనాయుడుతో తమ కుటుంబానికి 50 సంవత్సరాల ఆత్మీయ అనుబంధం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి ఆయన ఎన్నో రాజకీయ సలహాలు ఇచ్చారని చెప్పారు. పదవులకే ఆయన అలంకారమని పేర్కొన్నారు.


ఆ అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చూసిన ఎత్తులు పల్లాలు ఎవరూ చూసి ఉండరని నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. మీ ఆత్మకథ రచయితగా తనకు అవకాశం ఇవ్వాలని వెంకయ్యనాయుడిని ఆయన కోరారు. కఠోర సత్యాలతో కూడిన డాక్యుమెంటరీ చేసే ఛాన్స్ కూడా తనకు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. మీ వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకొని తాను ఈ స్థాయికి ఎదిగానని ఎమ్మెల్యే కోటంరెడ్డి గుర్తు చేసుకున్నారు.


పెద్దన్నతో దశాబ్దాల అనుబంధం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

తమ పెద్దన్న వెంకయ్యనాయుడితో తమకు దశాబ్దాల అనుబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తన తండ్రి రాజగోపాల్ రెడ్డి జనతా పార్టీలో వెంకయ్య నాయుడితో కలసి పని చేశారని గుర్తు చేసుకున్నారు. చరణ్ సింగ్ లాంటి పెద్దలు నెల్లూరు వచ్చినప్పుడు సభల ఏర్పాట్లలో తాను భాగస్వాములైన రోజులు ఇంకా తనకు గుర్తున్నాయని ఈ సందర్భంగా సోమిరెడ్డి వివరించారు. వెంకయ్య నాయుడు కీలకపాత్ర పోషించిన జై ఆంధ్రా ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం తమకు స్ఫూర్తి అని చెప్పారు.

ఆ స్ఫూర్తితోనే సారా వ్యతిరేక ఉద్యమంతో పాటు ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు. నిజాయతీగా ఉండాలి, కష్టపడి పని చేయాలని పెద్దన్న వెంకయ్య నాయుడు ఎప్పుడూ తమకు చెబుతారని తెలిపారు. ఏ స్థాయిలో ఉన్నా మా జిల్లా, మా సొంత నియోజకవర్గం అనే మమకారం చూపారని పేర్కొన్నారు. అనేక జాతీయ స్థాయి సంస్థలని సర్వేపల్లికి వెంకయ్య నాయుడు తీసుకు వచ్చారని గుర్తు చేశారు.


ఉదయగిరి నుంచి రాజకీయ అరంగేట్రం: ఎమ్మెల్యే కాకర్ల

విలువలతో కూడిన రాజకీయ ప్రస్థానానికి భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు నిలువెత్తు నిదర్శనం అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అభివర్ణించారు. ఉదయగిరి నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఉపరాష్ట్రపతిగా ఎదగటం గర్వకారణం అని పేర్కొన్నారు.


ఒదిగి ఉండే గొప్ప నేత: పాశం సునీల్ కుమార్

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు అని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. జాతీయ స్థాయికి ఎదిగినా.. ఆయన మాత్రం పురిటి గడ్డని మరువ లేదని అన్నారు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వివరించారు.


ఆయన జీవితం అందరికీ ఆదర్శం: ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర

ఉదయగిరిపై వెంకయ్య నాయుడుకి అపారమైన ప్రేమ ఉందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. అమృత్ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదే అని గుర్తు చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకి ఉన్న ఆటంకాలను కూడా ఆయన తొలగించారని చెప్పారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు.


విలువలతో కూడిన రాజకీయం: ఎమ్మెల్యే కురుగొండ్ల

వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానం స్ఫూర్తి దాయకం అని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెల్లడించారు. పదవుల కోసం ఆయన పాకులాడలేదని అన్నారు. పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చేలా, విలువలతో కూడిన రాజకీయం చేశారని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై ప్రశంసల జల్లు కురుపించారు.


ఆయన ఆజాత శత్రువు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అజాత శత్రువు అని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. రాజకీయాల్లో సరిలేరు నీకెవ్వరూ... అనేలా వెంకయ్యనాయుడు ప్రస్థానం సాగింది అని ఆమె చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. 10 మంది మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న..

గల్లంతైన మత్స్యకారులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం: ఏపీ డిప్యూటీ సీఎం

Updated Date - Jul 05 , 2026 | 09:52 PM