Share News

గుడ్ న్యూస్.. 10 మంది మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న..

ABN , Publish Date - Jul 05 , 2026 | 08:14 PM

ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన విశాఖకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న 10 మందిని ఒడిశా మెరైన్ పోలీసులు కాపాడినట్లు ఆయన వెల్లడించారు.

గుడ్ న్యూస్.. 10 మంది మత్స్యకారులు సురక్షితం: మంత్రి అచ్చెన్న..
Minister Kinjarapu Atchannaidu

విశాఖ: ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన విశాఖకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న 10 మందిని ఒడిశా మెరైన్ పోలీసులు కాపాడినట్లు ఆయన వెల్లడించారు. బోటు యజమాని దానయ్యతో పాటు మొత్తం 10 మంది మత్స్యకారులను రక్షించినట్లు పేర్కొన్నారు.

fishermen3.jpg


ఒడిశా మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయడంతో బోటు సిబ్బందిని కాపాడగలిగినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు. మెరైన్ పోలీసులు సకాలంలో స్పందించడంతోనే మత్స్యకారులు ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. వారంతా క్షేమంగా ఉండటం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారుల వేగవంతమైన స్పందనకు ధన్యవాదాలు తెలిపారు. బాధిత మత్స్యకారులను స్వస్థలానికి చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి అచ్చెన్న వెల్లడించారు.

fishermen2.jpg


మరోవైపు విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ప్రతికూల వాతావరణం మధ్యా సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. కాకినాడ నుంచి ప్రత్యేక నౌక, హెలికాప్టర్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. మర్చంట్ షిప్ ద్వారా ఓ మత్స్యకారుడిని రక్షించామని, మిగిలిన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. విశాఖ జిల్లా కలెక్టర్, ఐజీ మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ అధికారులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గల్లంతైన ప్రతి మత్స్యకారుడిని సురక్షితంగా తీసుకురావడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు.

fishermen.jpg


కాగా, విశాఖ చేపల రేవు నుంచి ఈనెల 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అలల తాకిడికి శనివారం మధ్యాహ్నం బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటు యజమాని కారె చిన్నయ్య ప్రాణాలతో బయటపడగా, మిగతా ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

జులై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ పునః ప్రారంభం: మంత్రి సత్యకుమార్

ముంబైలో మరో దారుణం.. వీడియో వైరల్..

Updated Date - Jul 05 , 2026 | 08:22 PM