Somireddy: జగన్, కేసీఆర్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:36 PM
మాజీ సీఎంలు కేసీఆర్, జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని తెలిపారు.
నెల్లూరు, జనవరి 15: ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్ రాయలసీమ లిఫ్ట్‌ను తాకట్టు పెట్టారని ఆరోపించారు. అప్పట్లో తెలంగాణలో అన్న కేసీఆర్ సీఎం అయితే.. ఏపీలో తమ్ముడు జగన్ సీఎం.. ఇద్దరిదీ విడదీయలేని అనుబంధం అంటూ ఎద్దేవా చేశారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని తెలిపారు. 2024 వరకు దాదాపు నాలుగేళ్ల పాటు, ఇద్దరూ సీఎంలుగా ఉన్న సమయంలో స్టే కొనసాగిందని చెప్పారు. వీరి కుమ్మక్కు రాజకీయాలని ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు.
ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కు అయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్జీటీ స్టే విధించిందా? ఎన్జీటీ పనులు ఆపిందా? ఎన్జీటీ ఫెనాల్టి వేసిందా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. అసలు లిఫ్ట్ పనులే మొదలు పెట్టలేదని.. రూ.వందల కోట్లు దోచుకోవడం కోసమే మట్టి పనులకి పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడానికి మాత్రం, ఎన్జీటీ స్టే అడ్డురాలేదని.. లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డువచ్చినట్టుంది అంటూ చురకలంటించారు. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన జగన్ సినిమా కథలను ప్రజలు నమ్మరన్నారు. ప్రజలంతా అర్థం చేసుకున్నారని.. వైసీపీ నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నాలుగో రోజుకు శ్రీశైలం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. పెరిగిన భక్తుల రద్దీ
Read Latest AP News And Telugu News