Share News

ప్రకృతి సాగులో ముందంజ.. సర్టిఫికేషన్‌లో వెనుకంజ!

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:21 AM

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధరలు పొందాలంటే సర్టిఫికేషన్‌ కీలకం. అయితే రాష్ట్రంలో వేలాది మంది రైతులు నమోదు చేసుకున్నప్పటికీ ధ్రువీకరణ పొందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం!.

ప్రకృతి సాగులో ముందంజ.. సర్టిఫికేషన్‌లో వెనుకంజ!

  • సాగు విస్తీర్ణం ఉన్నా రైతులకు సర్టిఫికెట్లు స్వల్పమే

  • 13,074 మందికిగాను 472 మందే నమోదు

  • క్షేత్రస్థాయిలో సాగు అంతగా లేకపోవడమే కారణం?!

(గుంటూరు సిటీ, ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధరలు పొందాలంటే సర్టిఫికేషన్‌ కీలకం. అయితే రాష్ట్రంలో వేలాది మంది రైతులు నమోదు చేసుకున్నప్పటికీ ధ్రువీకరణ పొందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం!. ప్రకృతి వ్యవసాయం విస్తీర్ణంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్‌.. అదే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సర్టిఫికేషన్‌లో మాత్రం వెనుకబడిందని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో నమోదు చేసుకున్న రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణానికి తగిన స్థాయిలో సర్టిఫికెట్లు జారీ కాలేదనే విషయం స్పష్టమైంది. ప్రకృతి వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రకృతి వ్యవసాయ ధ్రువీకరణ (సర్టిఫికేషన్‌) అందించడంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం 2025-26 నుంచి నేచురల్‌ ఫార్మింగ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. ఈ పథకం కింద రెండు సంవత్సరాలకు హెక్టారుకు రూ.2,100 చొప్పున సర్టిఫికేషన్‌ వ్యయాన్ని భరిస్తోంది. కానీ.. కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 13,074 మంది రైతులు నమోదు చేసుకోగా, 18,453.62 హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం నమోదైంది. ఇందులో ఇప్పటివరకు జారీ చేసిన సర్టిఫికెట్లు కేవలం 472 మాత్రమే. అంటే నమోదు చేసుకున్న రైతుల్లో అత్యల్ప శాతం మందికే ధ్రువీకరణ లభించింది.


సర్టిఫికేషన్‌ ఎందుకు కీలకం?

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు దేశవిదేశీ మార్కెట్లలో ప్రీమియం ధరలు లభించాలంటే ధ్రువీకరణ తప్పనిసరి. సర్టిఫికేషన్‌ లేకుండా రైతులు సాధారణ పంటలతో సమానమైన ధరలకే ఉత్పత్తులను విక్రయించాల్సి వస్తోంది. ఎగుమతులకు కూడా ధ్రువీకరణ ప్రధాన అర్హతగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 2025-26లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.116.22 కోట్ల (రూ.11,621.78 లక్షలు) నిధులిచ్చింది. దేశంలో అత్యధిక నిధులు పొందిన రాష్ర్టాల్లో ఏపీ ఒకటి. అయినప్పటికీ సర్టిఫికేషన్‌ పురోగతి మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదు. ప్రకృతి వ్యవసాయ ధ్రువీకరణలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడటానికి ప్రధాన కారణం.. అధికారిక లెక్కల్లో చూపుతున్నంత విస్తీర్ణంలో.. క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయం జరగడం లేదన్న ఆరోపణలే వినిపిస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 04:21 AM