Share News

తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు

ABN , Publish Date - Aug 22 , 2026 | 03:36 PM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
National Best Teacher Award 2026

అమరావతి, ఆగస్టు 22: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చినమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రాజేష్ చేస్తున్న కృషిని నారా లోకేశ్ ప్రశంసించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడంతో పాటు, వాట్సాప్ ఆటోమేషన్ ద్వారా శిక్షణ అందిస్తూ వేలాది మంది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల్లో సీట్లు సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా పాఠ్యపుస్తక రచయితగా కూడా విద్యా రంగానికి సేవలందిస్తున్నారని కొనియాడారు.


ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించి.. అదే వృత్తిలో ఉపాధ్యాయుడిగా ఎదిగి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక కావడం కౌలూరి రాజేష్ అంకితభావానికి, సేవా స్ఫూర్తికి నిదర్శనమని నారా లోకేశ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరాన్ని రాజేష్ తన పని ద్వారా చూపించారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని.. సమాజ అభివృద్ధికి వారి సేవలు అమూల్యమైనవని అన్నారు. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవాని, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన జెల్లి ప్రకాష్ రావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనందుకు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అన్నయ్యే ‘నా ఏకైక హీరో’.. చిరంజీవికి పవన్ బర్త్‌డే విషెస్

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 04:03 PM