Share News

క్రియేటర్‌ ఎకానమీదే భవిష్యత్తు

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:39 AM

‘విశాఖలో సినిమా పరిశ్రమ, క్రియేటర్‌ ఎకానమీ(సీఈ) అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తాం. క్రియేటర్‌ ఎకానమీ భవిష్యత్తులో అతిపెద్ద అవకాశాల్లో ఒకటిగా నిలవనుంది’ అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

క్రియేటర్‌ ఎకానమీదే భవిష్యత్తు

  • విశాఖలో సినిమా, సీఈ అభివృద్ధికి సహకారం.. వినోద రంగంలో యువతకు శిక్షణ

  • సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు యోచన

  • క్రియేటర్లకు సదుపాయాలపై ఉమ్మడి ప్రణాళిక

  • యువత రాజకీయాల్లోకి రావాలి

  • అరకులో మారథాన్‌కు ‘మహీంద్ర’తో చర్చలు

  • రానా పాడ్‌కాస్ట్‌లో మంత్రి లోకేశ్‌

  • ఏడాదిలో విశాఖలో మా సంస్థతో

  • సినీ నిర్మాణ కార్యకలాపాలు: రానా

విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘విశాఖలో సినిమా పరిశ్రమ, క్రియేటర్‌ ఎకానమీ(సీఈ) అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తాం. క్రియేటర్‌ ఎకానమీ భవిష్యత్తులో అతిపెద్ద అవకాశాల్లో ఒకటిగా నిలవనుంది’ అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘ది పవర్‌ ఆఫ్‌ పాజిబిలిటీ: బిల్డింగ్‌ పార్టనర్‌షిప్స్‌, క్రియేటింగ్‌ ది ఫ్యూచర్‌’ అనే అంశంపై ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌కు మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు. సినిమా పరిశ్రమ ఏపీలోనూ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? అని నటుడు రానా ప్రశ్నించగా... మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ... ‘క్రియేటర్‌ ఎకానమీ భవిష్యత్తులో అతిపెద్ద అవకాశాల్లో ఒకటిగా నిలుస్తుంది. సినిమాలు, యూట్యూబ్‌, గేమింగ్‌ అన్నీ ఇందులో భాగమే. నా కుమారుడు దేవాన్ష్‌కు కూడా సొంత యూట్యూబ్‌ చానెల్‌ ఉంది.


రాష్ట్రంలోని పిల్లలు, కళాశాల విద్యార్థుల్లోనూ ఇలాంటి సృజనాత్మకత ఉంది. చేతిలో ఉన్న ఫోన్‌తోనే వీడియోలు రూపొందించే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. సినిమా నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. అదే స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌... ప్రభుత్వం నుంచి సహకారం, పరిశ్రమ నుంచి చొరవ ఉంటే విశాఖలోనూ సినిమా పరిశ్రమకు మంచి అవకాశాలు సృష్టించవచ్చునని రానా పేర్కొనగా... లోకేశ్‌ స్పందిస్తూ... ‘మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. సినిమా, గేమింగ్‌ రంగాల్లో ఉన్న అనుభవాన్ని ఉపయోగించి ఏపీలో క్రియేటర్లకు అవసరమైన సదుపాయాలపై ఉమ్మడి ప్రణాళిక రూపొందిద్దాం’ అని ప్రతిపాదించారు.

ఇందుకు రానా స్పందిస్తూ... ‘విశాఖలో సినిమా రంగంతోపాటు ఇతర క్రియేటివ్‌ రంగాల వారికీ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంతో కలసి పనిచేస్తా. దీనిపై బ్లూఫ్రింట్‌ను సోమవారం ఉదయానికి సిద్ధం చేస్తా’ అని ప్రకటించారు. ‘అదే స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అని లోకేశ్‌ చమత్కరించారు. ‘రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ ఉంది. విశాఖను దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. అరకు లోయలో మారథాన్‌ నిర్వహణకు మహీంద్ర సంస్థతో చర్చలు జరుపుతున్నాం. పెట్టుబడుల ఒప్పందాలు, ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యమైతే.. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడమే మా ప్రధాన ధ్యేయం’ అని లోకేశ్‌ అన్నారు.


వైఫల్యాలను అవకాశాలుగా మల్చుకోవాలి..

ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... ‘ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతికూల అభిప్రాయాలను పట్టించుకోకుండా లక్ష్యం వైపు సాగాలి. ఫెయిల్‌ అంటే ఫస్ట్‌ అటెమ్ట్‌ ఇన్‌ లెర్నింగ్‌ అని., ప్రతి ప్రయత్నం నుంచి నేర్చుకుంటూ మానసికంగా దృఢంగా ఎదగాలి’ అన్నారు. ‘సినిమా, సంగీతం, యానిమేషన్‌, గేమింగ్‌ వంటి రంగాల్లో యువతకు శిక్షణ అందించేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. సంగీత దర్శకులు, సినిమా రంగంలోని వారితో కలిసి యువతకు శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తాం. సంగీత శిక్షణ కోసం తమన్‌తో కలసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. తిరుపతిలోనూ ఇందుకోసం ఒక సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేసే ఆలోచన ఉంది’ లోకేశ్‌ పేర్కొన్నారు.


ఏపీ ప్రభుత్వంతో పనిచేస్తా..: రానా

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ... ‘రాబోయే ఏడాదిలో విశాఖలో మా సంస్థ తరఫున సినీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా కృషి చేస్తా. విశాఖ సిటీ ఆఫ్‌ డెస్టినీ. ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నేను ఎదుచూస్తున్నా. బాహుబలి సినిమాను దేశవ్యాప్తంగా పరిచయం చేసినట్టే, ఏపీ అభివృద్ధి గాథనూ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది’ అన్నారు.

యువత రాజకీయాల్లోకి రావాలి

26 ఏళ్ల వయసులో ఎవరైనా రాజకీయాల్లో కెరియర్‌ను బిల్డ్‌ చేసుకోవాలనే కలలుకంటే సాధ్యపడుతుందా.? అని రానా ప్రశ్నించగా, స్పందించిన మంత్రి లోకేశ్‌... తప్పకుండా సాధ్యడుతుంది అన్నారు. ‘యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రస్తుతం వారికి మంచి అవకాశాలున్నాయి. విశాఖతో పాటు పలుచోట్ల ఇటీవల యువత మేయర్లుగా, మునిసిపల్‌ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. 25 మంది మంత్రుల్లో 17 మంది యువకులే. వ్యవస్థలో లోపాలున్నాయని విమర్శించడం కాదు. వాటికి పరిష్కారాలు చూపించే ప్రక్రియలో యువత భాగస్వామ్యం కావాలి’ అని లోకేశ్‌ అన్నారు. మంత్రి కొండపల్లి, విశాఖ మేయర్‌ శ్రావణిలను ఉదహరించారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 05:41 AM