పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించడం గర్వకారణం: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Sep 14 , 2026 | 09:28 PM
పారా స్విమ్మింగ్‌లో ఏపీకి చెందిన బలగ గణేష్ మాస్టర్ సంచలనం సృష్టించారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు విస్తరించిన బోడెన్సీ సరస్సులో 12 కిలోమీటర్ల దూరాన్ని వెట్‌సూట్ లేకుండా ఈదుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ ఘనతపై మంత్రి నారా లోకేశ్ గణేష్ మాస్టర్‌కు అభినందనలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 14: పారా స్విమ్మింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బలగ గణేష్ మాస్టర్ అరుదైన ఘనత సాధించారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకూ విస్తరించిన బోడెన్సీ సరస్సులో ఏకంగా 12 కిలోమీటర్ల దూరాన్ని వెట్‌సూట్ లేకుండా ఈదుతూ ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పారా స్విమ్మర్‌గా అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసిన గణేష్ మాస్టర్‌కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. జర్మనీకి చెందిన స్వెన్ ఎకార్డ్ పేరిట ఉన్న 5 గంటల 33 నిమిషాల రికార్డును అధిగమిస్తూ.. గణేష్ మాస్టర్ కేవలం 5 గంటల 14 నిమిషాల 13 సెకన్లలో 12 కిలోమీటర్ల ఈతను పూర్తి చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
గణేష్ మాస్టర్ సాధించిన ఈ అద్భుత విజయం ఆంధ్రప్రదేశ్ క్రీడా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో టీచర్‌గా ఎంపికైన గణేష్ మాస్టర్.. మరోవైపు పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ, అపారమైన పట్టుదల, కఠోర సాధనతో గణేష్ మాస్టర్ సాధించిన ఈ ఘనత ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. క్రీడల్లో ప్రతిభను చాటుతూ రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
నల్లగొండలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News