డీఎస్సీపై చర్చించదలిస్తే అసెంబ్లీకి రా!
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:45 AM
జగన్ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలు, కల్తీ మద్యం వ్యవహారంపై ఈడీ, సర్వోన్నత న్యాయస్థానం, కేంద్రం లోతుగా విచారణ చేపట్టటంతో.. ఆ వ్యవహారాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా దారి మళ్ళించేందుకే.. జగన్ డీఎస్సీ అంశాన్ని తన ఉగ్రవాద తరహా దురాగతాలకు అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోమర్ మండిపడ్డారు.
మద్యం కుంభకోణం పక్కదారి పట్టించేందుకే దుశ్చర్యలు: నాదెండ్ల
దాడి చేసిన ఒక్కరినీ వదిలిపెట్టం
హోంమంత్రి అనిత హెచ్చరిక
వైసీపీ పాపాలు పండేసమయం వచ్చింది
శాప్ చైర్మన్ రవి నాయుడు మండిపాటు
తెనాలి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలు, కల్తీ మద్యం వ్యవహారంపై ఈడీ, సర్వోన్నత న్యాయస్థానం, కేంద్రం లోతుగా విచారణ చేపట్టటంతో.. ఆ వ్యవహారాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా దారి మళ్ళించేందుకే.. జగన్ డీఎస్సీ అంశాన్ని తన ఉగ్రవాద తరహా దురాగతాలకు అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోమర్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘జనం తనను పట్టించుకోవటంలేదనే జగన్ డీఎస్సీ మాటున రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కుట్రలు పన్నారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు మద్యం అక్రమాలపై ఈడీ లోతులకెళ్లి విచారణ చేస్తుండటంతో.. అదెక్కడ బయటకొస్తుందోనన్న భయంతోనే జగన్ తన పార్టీలోని అసాంఘిక శక్తులను డీఎస్సీ అభ్యర్థులుగా రంగంలోకి దింపి అలజడులు సృష్టిస్తున్నారు. మీరు చేసిన పాపాలను పారదర్శకంగా కడుక్కోవాలనుకుంటే అసెంబ్లీకి రావాలి. అన్యాయం జరిగినట్లు రుజువులుంటే నిలదీయాలి. అంతే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంటే వాటిని ఆపాలని చూస్తే ఊరుకోం. అలజడులు సృష్టించిన వారిలో ఎవరినీ ప్రభుత్వం వదలదు’ అని అన్నారు.
బియ్యం పంపిణీకి ఆదేశాలు
పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న తుఫాను బాధితులకు బియ్యం అందించాలని ఆదేశించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. పోలవరం ప్రాంతంలోని 17 గ్రామాల్లోని వారికి వెంటనే సరకులు అందించాలని ఆదేశించామన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, ఏఎస్సార్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఇబ్బంది పడుతున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారన్నారు. వారందరికీ సరకులు అందించనున్నట్టు మంత్రి వివరించారు.
ఈ వార్తలనూ చదవండి...