Share News

100శాతం స్ట్రైక్ రేట్

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:38 AM

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ర్టైక్‌ రేట్‌ సాధించడం మన లక్ష్యం కావాలి. మన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంకల్పం ఇదే’ అని జనసేన స్థానిక ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

100శాతం స్ట్రైక్ రేట్

  • స్థానికంలో ఇదే మన లక్ష్యం.. పవన్‌ సంకల్పం

  • పార్టీ నిర్దేశించే నియమాల ప్రకారం ముందుకెళ్దాం

  • జనసేన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యులకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు

  • రాష్ట్ర స్థాయిలో కూటమి సమన్వయ కమిటీ చర్చలు

  • జిల్లా, నియోజకవర్గాల వారీగానూ కమిటీలు

  • పార్టీ కమిటీ సమావేశంలో మంత్రి మనోహర్‌

అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ర్టైక్‌ రేట్‌ సాధించడం మన లక్ష్యం కావాలి. మన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంకల్పం ఇదే’ అని జనసేన స్థానిక ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని సీ కన్వెన్షన్‌ హాలులో ఈ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. తొలుత కమిటీ సభ్యులకు పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన సందేశాన్ని మనోహర్‌ తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో వ్యూహాలు భిన్నంగా ఉంటాయని, అభ్యర్థుల ఎంపిక దశ నుంచే పార్టీ నిర్దేశించే నియమాల ప్రకారం ముందుకు వెళ్లాలని పవన్‌ సూచించారని చెప్పారు. అందుకు అనుగుణంగా ఎన్నికల కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్దామన్నారు. ముందుగా నగర, పురపాలక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టాలన్నారు. డివిజన్లు, వార్డుల్లో మన బలాబలాలు గుర్తించాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కూటమి సమన్వయ కమిటీ చర్చలు నడుస్తున్నాయని, జిల్లా, నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలు ఉంటాయని తెలిపారు. జనసేన స్థానిక ఎన్నికల కమిటీ సభ్యులకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగిస్తారని చెప్పారు. సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్యాడర్‌ను కలవాలని, ఎన్నికలకు సమాయత్తం చేయాలని, వారి అభిప్రాయాలను కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. భేటీలో కమిటీ సభ్యులు బుద్ధప్రసాద్‌, టి.శివశంకర్‌, కందుల దుర్గేశ్‌, వల్లభనేని బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.


యువ నాయకత్వం కీలకం

ఇప్పటి నుంచి 30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికను పవన్‌ సిద్ధం చేశారని, దీన్ని అందరూ తప్పకుండా పాటించాలని మనోహర్‌ తెలిపారు. ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువనాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకం కావాలన్నారు. యువతరం ఎప్పుడూ పవన్‌ వెంటే ఉందన్నారు. 2019 ఎన్నికల్లో సాధారణ యువతకు అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల ద్వారా పార్టీ బలాన్ని మరింత చూపించాలన్నారు. 2024 ఎన్నికల్లో త్యాగం చేసిన చోట్ల కూడా తగిన అవకాశాలు కల్పించాలన్నారు. పవన్‌ జన్మదినం సెప్టెంబరు 2న యువజన విభాగాన్ని మొదలు పెట్టబోతున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఆవిష్కరిస్తామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

వెలిగొండ నిర్వాసితులకు గుడ్‌న్యూస్..

నేపాల్ జలప్రళయం.. తప్పించుకున్న విశాఖ వాసులు

Updated Date - Aug 29 , 2026 | 03:38 AM