బాలిక కిడ్నాప్ చిన్న వ్యవహారం కాదు
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:34 AM
మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం చిన్న వ్యవహారం కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడు జానీసైదా బాలికను కిడ్నాప్ చేసి ఎక్కడకు తీసుకెళ్లాడు.. వారు ఇంతకాలం ఎక్కడున్నారు..? బాలికను తీసుకెళ్లేందుకు సహకరించిన వారెవరు..? వారికి ఆశ్రయం కల్పించింది ఎవరు..? బాలిక మైనర్ అని తెలిసి కూడా లాడ్జిల్లో గదులు ఎలా ఇచ్చారు..?
జూన్ 9న బాలికను కిడ్నాప్ చేస్తే ఇన్నాళ్లూ ఏం చర్యలు తీసుకున్నారు?
ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి
డీజీపీని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం
అమరావతి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం చిన్న వ్యవహారం కాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడు జానీసైదా బాలికను కిడ్నాప్ చేసి ఎక్కడకు తీసుకెళ్లాడు.. వారు ఇంతకాలం ఎక్కడున్నారు..? బాలికను తీసుకెళ్లేందుకు సహకరించిన వారెవరు..? వారికి ఆశ్రయం కల్పించింది ఎవరు..? బాలిక మైనర్ అని తెలిసి కూడా లాడ్జిల్లో గదులు ఎలా ఇచ్చారు..? చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పేర్కొంటూ డీజీపీని ఆదేశించింది. షేక్ జానీసైదా అనే వ్యక్తి చేతిలో కిడ్నాప్‌కు గురైన 15 ఏళ్ల బాలికను పోలీసులు సోమవారం హైకోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ధర్మాసనం పోలీసులకు పలు ప్రశ్నలు సంధించింది. జానీసైదా ఈ ఏడాది జూన్ 9న బాలికను కిడ్నాప్ చేస్తే ఇన్నాళ్లూ ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు ఏమి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ పూర్తి వివరాలు అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తాను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు బాలిక తన తండ్రితో ఇంటికి వెళ్తానని చెప్పడంతో అందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలో సహకరించాలని తండ్రికి సూచించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ ఆలపాటి గిరిధర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. పదో తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని గుంటూరుకు నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది జూన్ 9 పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాలో పరిచయమైన జానీసైదా తన కుమార్తెను ట్రాప్ చేసి తీసుకెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేసు నమోదు చేసి మూడు నెలలు కావస్తున్నా... తన కుమార్తె ఆచూకీ కొనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని, ఆమెను కోర్టు ముందు హాజరు పరిచి తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా... పోలీసుల నిర్లక్ష్య వైఖరిని జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ తుహిన్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఎండగట్టింది. డీజీపీ హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించింది. దీంతో డీజీపీ సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి