Share News

‘జూ’ల్లో వన్యపాణులను దత్తత తీసుకోవాలి

ABN , Publish Date - Sep 01 , 2026 | 06:29 AM

వన్యప్రాణుల సంరక్షణ ప్రతిపౌరుడు బాధ్యతగా స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కోరారు. విశాఖ జూలో అధునాతన ఇంక్యుబేషన్‌ పద్ధతిలో ఇటీవల 128 కొత్త జీవాలు జన్మించిన నేపథ్యంలో జీవవైవిధ్య పరిరక్షణ చర్యలకు మద్దతుగా విశాఖతో పాటు తిరుపతి జూల్లో జంతువులను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

‘జూ’ల్లో వన్యపాణులను  దత్తత తీసుకోవాలి

  • కార్పొరేట్‌, పారిశ్రామిక, స్వచ్ఛంద సంస్థలకు

  • డిప్యూటీ సీఎం పవన్‌ పిలుపు

అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): వన్యప్రాణుల సంరక్షణ ప్రతిపౌరుడు బాధ్యతగా స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కోరారు. విశాఖ జూలో అధునాతన ఇంక్యుబేషన్‌ పద్ధతిలో ఇటీవల 128 కొత్త జీవాలు జన్మించిన నేపథ్యంలో జీవవైవిధ్య పరిరక్షణ చర్యలకు మద్దతుగా విశాఖతో పాటు తిరుపతి జూల్లో జంతువులను దత్తత తీసుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో సోమవారం అధికారులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. జూ ప్రాంగణాలను మరింత పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడం, జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని కల్పించే లక్ష్యంతో పవన్‌కల్యాణ్‌ జూ అధికారులకు పలు సూచనలు చేశారు. జూ పరిసరాలను వ్యర్థాల వర్గీకరణ, ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు, పచ్చదనం సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలు మాత్రమే కాదని, వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్ర బిందువులుగా నిలవాలని స్పష్టంచేశారు.


  • పరిశ్రమలన్నీ 33శాతం పచ్చదనం పాటించాలి

రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమ ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనం ఉండేలా చూడాలని ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశ్రమలన్నీ పర్యావరణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. పరిశ్రమలన్నీ 33శాతం పచ్చదనం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏపీ గ్రీన్‌, కాలుష్య నియంత్రణ మండలిని సోమవారం ఆదేశించారు. పవన్‌కల్యాణ్‌ ఇంకా ఏమన్నారంటే.. ‘రాష్ట్ర ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో.. పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యం. ప్రతి పారిశ్రామికవేత్త దీనిని సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలి. పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్‌ను అందించడం మనందరి బాధ్యత. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా నిర్ధేశిత పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలి. పచ్చదనం ద్వారా సమాజానికి, రాబోయే తరాలకు, సహజసిద్ధమైన వాతావరణాన్ని అందించగలం’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

పసిప్రాయపు ప్రతిబింబం..

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

Updated Date - Sep 01 , 2026 | 06:29 AM