Share News

వికసిత్‌ భారత్‌లో ఏపీనే కీలకం

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:02 AM

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో ఏపీ మెయున్‌ గ్రోత్‌ ఇంజన్‌గా నిలవాలని కోరుకుంటోందని, ఇందుకు పెట్టుబడిదారులు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ కోరారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు.

వికసిత్‌ భారత్‌లో ఏపీనే కీలకం

  • అభివృద్ధిలో మాకు స్పష్టమైన లక్ష్యం ఉంది

  • ఎన్నో ప్రతిష్ఠాత్మక కంపెనీలు వస్తున్నాయి

  • పెట్టుబడిదారులను ఏపీ అభివృద్ధిలో

  • దీర్ఘకాలిక భాగస్వాములుగా చూస్తాం

  • ఏపీ-గుజరాత్‌ కలిసి పనిచేస్తే అద్భుతాలు

  • మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

  • అహ్మదాబాద్‌ సీఐఐ రోడ్‌షోలో లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో ఏపీ మెయున్‌ గ్రోత్‌ ఇంజన్‌గా నిలవాలని కోరుకుంటోందని, ఇందుకు పెట్టుబడిదారులు మద్దతుగా నిలవాలని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ కోరారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక ప్రగతిలో గుజరాత్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పారిశ్రామికవేత్తల స్ఫూర్తి, మౌలికసదుపాయాలు, విధానాలు, వాటి అమలుతో ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో గుజరాత్‌ నిరూపించిందన్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌ అభివృద్ధి ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అభివృద్ధి దిశగా ఏపీ శరవేగంగా దూసుకెళుతోందని, ఈ ప్రయాణంలో గుజరాత్‌ పారిశ్రామిక రంగం భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏపీ ప్రత్యేకత

‘ఏపీ అభివృద్ధి విషయంలో మాకు స్పష్టమైన లక్ష్యం ఉంది. అత్యుత్తమ పెట్టుబడులు, సాంకేతికతలు, కంపెనీలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రౌండింగ్‌ అయ్యేలా చూస్తున్నాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏపీ ప్రత్యేకత. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకే వచ్చాయి. ఇది ప్రారంభం మాత్రమే’ అని లోకేశ్‌ అన్నారు.


ఏపీలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌

‘ఈ రోజుల్లో పెట్టుబడిదారులు నమ్మకమైన భాగస్వాముల కోసం చూస్తున్నారు. పెట్టుబడి ప్రకటన తర్వాత కూడా మాతో కలిసి పనిచేసే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. అలాంటి విధానాలను ఏపీలో తీసుకువచ్చాం. గూగుల్‌ ఏఐ హబ్‌ పెట్టుబడి ఏపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. గుజరాత్‌లో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటే ఏపీలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ ఉంది. ఏపీకి స్పీడ్‌, స్టెబిలిటీ, సర్వీస్‌ అనే మూడు ‘ఎస్‌’లు ప్రత్యేకం. పెట్టుబడిదారులను ప్రభుత్వం వద్దకు అనుమతుల కోసం వచ్చేవారిగా చూడకుండా వారిని ఏపీలో దీర్ఘకాలిక అభివృద్ధి భాగస్వాములుగా పరిగణిస్తాం. ఏపీ ప్రభుత్వ కృషి ఫలించి ఎన్నో ప్రతిష్ఠాత్మక కంపెనీలు వస్తున్నాయి’ అని లోకేశ్‌ చెప్పారు.

ఏపీ-గుజరాత్‌ కలిసి పనిచేయాలి

పెట్టుబడిదారులకు గుజరాత్‌ లేదా ఏపీలో ఒకదాన్ని ఎంచుకోవాలని తాను చెప్పడం లేదని, రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించగలవని తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని గుజరాత్‌ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐఐ గుజరాత్‌ స్టేట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, సింఫనీ లిమిటెడ్‌ ఎండీ అచల్‌ బకేరీ, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

నేను.. ఏపీకి డోలో-650ని: లోకేశ్‌

ఏపీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంటే నిదర్శనమని లోకేశ్‌ అన్నారు. ఆదిత్య మిట్టల్‌తో తొలిసారి జూమ్‌లో మాట్లాడినప్పటి నుంచి శంకుస్థాపన జరిగే వరకు కేవలం 17 నెలలే పట్టిందన్నారు. ఎవరైనా పారిశ్రామికవేత్త ఏదైనా సమస్యతో తమ దగ్గరికి వస్తే దాన్ని వ్యక్తిగత సమస్యగా కాకుండా వ్యవస్థాగత సమస్యగా పరిగణించి పరిష్కరిస్తామని చెప్పారు. కొంతమంది పారిశ్రామికమిత్రులు తనను ఏపీకి డోలో-650గా సరదాగా అంటుంటారని, వారికి ఎలాంటి తలనొప్పి కలిగించే సమస్యనైనా తాను పరిష్కరిస్తానని వారు నమ్ముతారని లోకేశ్‌ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:02 AM