Share News

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:42 AM

విద్య, వైద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ రెండు రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామని, ఇందుకోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం

  • కీలకమైన ఈ రంగాలపై ప్రభుత్వం దృష్టి

  • ఇందుకు కలిసి పనిచేద్దాం: మంత్రి లోకేశ్‌

  • విశాఖలో ఏఐజీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన

విశాఖపట్నం/ఎండాడ/సిరిపురం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): విద్య, వైద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ రెండు రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామని, ఇందుకోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం విశాఖపట్నం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖ నగరంలోని ఎండాడ ప్రాంతంలో ఏఐజీ (ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ) హాస్పిటల్స్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జీవితంలో విద్య, వైద్యం అనేవి చాలా కీలకమని, అందుకే ఏరికోరి విద్యా శాఖను ఎంచుకున్నానన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని పేర్కొన్నారు. మన కంటికి కనిపించే దేవుడు వైద్యుడని, వారు వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కనబెట్టి.. ఎన్నో త్యాగాలు చేస్తుంటారని కొనియాడారు. కరోనా సమయంలో తమ జీవితాలను ఫణంగా పెట్టి వైద్యులు పనిచేశారని ప్రశంసించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు చిరునామా ఏఐజీ హాస్పిటల్స్‌ అని, నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. హాస్పిటల్స్‌ చైర్మన్‌ నాగేశ్వరరెడ్డి అంకితభావంతో పనిచేసే వ్యక్తి అని.. ఆయనకు, తనకు మధ్య ఎంతో అనుబంధం ఉందన్నారు. నాగేశ్వరరెడ్డి విశాఖలోనే పుట్టి, పెరిగారని చెప్పారు. పట్టుదల, క్రమశిక్షణతో గ్యాస్ర్టో ఎంటరాలజీలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఎదిగారని ప్రశంసించారు. ప్రభుత్వపరంగా ఏఐజీ హాస్పిటల్స్‌కు అన్నివిధాలా సహకారం అందిస్తామని మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఇది కేవలం పెట్టుబడి మాత్రమే కాదని, జీవితాలనే మార్చేసే సందర్భమన్నారు. విశాఖలో రూ.2 వేల కోట్లతో వెయ్యి పడకల సామర్థ్యంతో పూర్తిస్థాయి హెల్త్‌ కేర్‌ ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. సుమారు వెయ్యి మంది డాక్టర్లు వైద్య సేవలందిస్తారని, 9 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.


ఇకపై విశాఖలోనే అన్ని చికిత్సలు: నాగేశ్వరరెడ్డి

ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. విశాఖ వైద్య రంగంలో తమ చారిత్రక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరవాసులు వైద్య సేవల కోసం ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్తున్నారని, ఇకపై విశాఖలోనే అన్నింటికీ చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఎంపీ ఎం.శ్రీభరత్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏఐజీ హాస్పిటల్స్‌ వైస్‌ చైర్మన్‌ పీవీఎస్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఆనందపురం మండలం గంభీరంలో ఉన్న ప్రేమ ఉదయం, ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌, హరేకృష్ణ వైకుంఠం ప్రాంగణాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లోనూ లోకేశ్‌ పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని దేశంలో నంబర్‌వన్‌ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. డేటా సెంటర్ల విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయని, ప్రజల ప్రయోజనాలు, ప్రకృతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టదని స్పష్టం చేశారు. అమ్మకు చెప్పలేని పని ఏదీ చేయకూడదని అభిప్రాయపడ్డారు.ముందుగా హరేకృష్ణ వైకుంఠం ప్రాంగణంలో కల్చరల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ భూమిపూజ చేశారు. ఆ తర్వాత ప్రేమ గ్రూపు ఇనిస్టిట్యూషన్స్‌ నూతన కాలేజీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌/స్నేహ సంధ్య ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌ జెరియాట్రిక్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ను మంత్రి లోకేశ్‌ ప్రారంభించారు.


నిజాయితీకి మారుపేరు రోశయ్య

  • పాఠ్యాంశంగా ఆయన జీవితం: లోకేశ్‌

రాజకీయ విలువలు, నిజాయితీకి నిలువుటద్దం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అని మంత్రి లోకేశ్‌ కొనియాడారు. విశాఖపట్నం నగరంలోని సిరిపురం జంక్షన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో లోకేశ్‌ మాట్లాడుతూ.. రోశయ్య విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ ఆయన సేవలు గుర్తుకొచ్చేలా ‘ది స్టాట్యూ ఆఫ్‌ స్టేట్స్‌మన్‌’ అని పిలుచుకుందామన్నారు. రాజకీయ విలువలకు ప్రతీకగా నిలిచిన రోశయ్య అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన్ను ఒక రాజకీయ పాఠశాలగా అభివర్ణించవచ్చన్నారు. రోశయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో అధ్యాయంగా పెట్టించే బాధ్యత తీసుకుంటానన్నారు. విగ్రహావిష్కరణలో మంత్రి టీజీ భరత్‌, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, పల్లా శ్రీనివాసరావు, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ డూండి రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. రోశయ్య కుటుంబసభ్యులతో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు.

ఈ వార్తలను కూడా చదవండి

2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Updated Date - Sep 01 , 2026 | 05:42 AM