ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రకటన..
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:45 AM
డీఎస్సీ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నాడు అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన మంత్రి లోకేశ్.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీని తమ బాధ్యతగా భావించామని..
అమరావతి: డీఎస్సీ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నాడు అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన మంత్రి లోకేశ్.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్ష పార్టీకి తాను సమాధానం ఇవ్వడం లేదన్న మంత్రి.. డీఎస్సీని ఎలా నిర్వహించాం, ఎలాంటి నిబంధనలు పాటించి నియామకాలు చేపట్టామో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సి ఉందన్నారు. అందుకే.. మెగా డీఎస్సీపై ఉన్న నిజాలు తెలియజేస్తూ ఆ సమాచారాన్ని సభ్యులకు పుస్తక రూపంలో పంపామని మంత్రి లోకేశ్ తెలిపారు.
అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రసంగం..
‘కూటమి ప్రభుత్వం డీఎస్సీని బాధ్యతగా భావించింది. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాం. ఈ పోస్టులకు 3,36,300 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. 148 రోజుల్లోనే డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తిచేశాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంస్కరణలు పాఠశాలల్లో తీసుకువచ్చాం. టీచర్ రిక్రూట్‌మెంట్ చేయకుండా పాఠశాలలు అభివృద్ధి చెందవు. మహిళలకు డీఎస్సీలో 33శాతం రిజర్వేషన్ తీసుకువచ్చాం. తెలుగుదేశం పార్టీ హయాంలోనే లక్షా 80వేల మంది టీచర్లను నియమించాం.’ అని మంత్రి లోకేశ్ తెలిపారు.
‘2019 నుంచి 24 వరకూ ఒక్క టీచర్ ఉద్యోగ నియామకం కూడా జరగలేదు. వైసీపీ హయాంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం.. టీచర్లను ట్రైనింగ్ కోసం సింగపూర్, ఫిన్లాండ్ పంపితే.. వైసీపీ హయంలో మద్యం షాపుల ముందు కాపలా పెట్టారు.’ అని గత ప్రభుత్వ విధానాలను మంత్రి లోకేశ్ ఎండగట్టారు.
‘డీఎస్సీ కోసం 42వేల ప్రశ్నలు తయారు చేశాం. డీఎస్సీకి ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చాం. నియామకాలపై అనేక స్థాయిల్లో వచ్చిన గ్రీవెన్స్‌ను పరిష్కరించాం. భిన్నాభిప్రాయాలతో 336 కేసులు నమోదు చేశారు. డీఎస్సీ పరీక్షను టీసీఎస్ ఐయాన్ ప్లాట్ ఫాం ద్వారా నిర్వహించాం. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను డిస్ట్రిక్ట్ యూనిట్‌గా చేశాం. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లతో నియామకాలు చేపట్టాం. టీచర్ క్వాలిఫికేషన్‌లో టెట్ మ్యాండేటరీ చేశాం. టీసీఎస్ ఐయాన్ ద్వారా నోటిఫికేషన్‌ను పారదర్శకంగా నిర్వహించాం. ఎస్సీ వర్గీకరణ పూర్తిచేసి, ఉపకులాలను గ్రూప్‌లో సెట్ చేసిన తరువాతే డీఎస్సీ నిర్వహించాం. గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే.. 65 స్పోర్ట్స్ కేటగిరీలకు పెంచాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటా పెంచాం.’ అని మంత్రి లోకేశ్ క్లారిటీ ఇచ్చారు.
వైసీపీపై మంత్రి లోకేశ్ విమర్శలు..
‘కొందరికి డీఎస్సీ అంటే అర్థం కూడా తెలియదు. వాళ్లే పేపర్ లీక్ అని మాట్లాడుతున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పక్కాగా జరిగాకే ఉద్యోగాలిచ్చాం. ఏడాది తర్వాత డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మీ ఆరోపణలకు ఆధారాలు చూపండి. డీఎస్సీపై టీమ్ 11వి అనవసర ఆరోపణలు’ అంటూ మంత్రి లోకేశ్ కొట్టిపారేశారు.
Also Read:
ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు.. సంచుల నిండా డబ్బులే..
బీజేపీకి షెహజాద్ పూనావాలా మరోసారి రాజీనామా లేఖ.. ఆమోదించాలని విజ్ఞప్తి..