జూన్ 30 లోగా బయోమెట్రిక్ పూర్తి చేయకుంటే గ్యాస్ సబ్సిడీ కట్!
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:47 AM
వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జ్వల పథకం లబ్ధిదారులతో పాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా ఈ నెలాఖరులోగా తమ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఆంధ్రజ్యోతి, జూన్ 17: వంటగ్యాస్ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జ్వల (Ujjwala) పథకం లబ్ధిదారులతో పాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్ వినియోగదారులు కూడా జూన్ 30 లోగా తమ బయోమెట్రిక్ (Biometric Authentication) ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ గడువులోగా బయోమెట్రిక్ పూర్తి చేయని వారి ఖాతాల్లో సబ్సిడీ జమ కాకుండా నిలిపివేయనున్నారు. ఏడాదిగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నెల 30లోపు పూర్తి చేయాలని కేంద్రం నిర్దేశించింది.
ఒకవేళ జూన్ 30 గడువు దాటిన తర్వాత బయోమెట్రిక్ పూర్తి చేసుకుంటే.. ఆ తేదీ తర్వాత తీసుకునే సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. గడువు ముగిసిన రోజు నుంచి బయోమెట్రిక్ పూర్తయ్యే మధ్య కాలంలో తీసుకునే సిలిండర్లపై సబ్సిడీని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం తన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.
గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బయోమెట్రిక్ (వేలిముద్రలు/ఐరిస్) అప్‌డేట్ చేయని వారు వెంటనే తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. జూన్ 30 లోగా ఈ పని పూర్తి చేసుకుంటేనే ఎలాంటి అంతరాయం లేకుండా సబ్సిడీ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు, వేలిముద్రలు లేదా ఐరిస్ వంటి మూడు విధానాలతో ఎల్‌పీజీ వినియోగదారుల ఈ-కేవైసీని పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ కోసం వినియోగదారులే నేరుగా ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. గ్యాస్ ఏజెన్సీల డీలర్ల వద్ద ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు కూడా అవకాశం కల్పించారు. కొన్ని గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా
ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో