వైసీపీ నేతల సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్..
ABN , Publish Date - Aug 04 , 2026 | 06:06 PM
నంద్యాల జిల్లా: వైసీపీ నేతలు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఓ పక్క నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం రాద్దాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
నంద్యాల జిల్లా: వైసీపీ నేతలు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఆ పార్టీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. ఓ పక్క నీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం చంద్రబాబు సర్కార్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాన్ పార్టీ నేతల తీరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని మంత్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు గత రెండేళ్లలోనే రూ.12,480 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో రాయలసీమ నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఏకంగా రూ.35 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో సాగునీటి రంగానికి రూ.10,014 కోట్లు కేటాయించి పనులను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. హంద్రీ-నీవా ఫేజ్-2 విస్తరణ పనుల కోసం మరో రూ.1,180 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం, గోరుకల్లు, అలగనూరు ప్రాజెక్టుల పునరుద్ధరణకు చంద్రబాబు ప్రభుత్వం రూ.610 కోట్లు కేటాయించిందన్నారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ లీకేజీల నివారణ కోసం కూటమి ప్రభుత్వం రూ.54 కోట్లు విడుదల చేసిందని, పనులు కూడా ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు.
వైసీపీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అలగనూరు ప్రాజెక్టు మరమ్మతుల వ్యయం పెరిగిందని బీసీ జనార్దన్ ఆరోపించారు. అలాగే రూ.20 కోట్లతో నిర్మించిన దద్దనాల ప్రాజెక్టును కూడా ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. కానీ, తుంగభద్ర డ్యామ్‌కు ఐదు రోజుల్లోనే తాత్కాలిక గేటును ఏర్పాటు చేసి 30 టీఎంసీల నీటిని కూటమి ప్రభుత్వం కాపాడిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుభిక్షంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యానవన రంగ అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రాయలసీమకు రెండేళ్లలోనే రూ.4.58 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రూ.4 వేల కోట్లతో అల్ట్రాటెక్ రెండో యూనిట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి తెలిపారు.
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసినట్లు జనార్దన్ రెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ప్రశంసించారు. పాఠశాల విద్యార్థుల కోసం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే అన్ని అంశాలపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి
దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం సేవలు..
PM-ABHIM నిధుల వినియోగంలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం..