కర్నూలును ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:25 PM
కర్నూలు నగర పారిశుద్ధ్య వ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెత్త సేకరణ, తరలింపును మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే..
కర్నూలు, సెప్టెంబర్ 2: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత ఆధునికంగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు మొత్తం 91 ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు మంజూరు కాగా.. తొలి విడతగా 30 వాహనాలను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ సిరి, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పాల్గొన్నారు. గతంలో చెత్త సేకరణకు వినియోగించిన వాహనాలు సరైన నిర్వహణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వాటి స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా జరుగుతుందని చెప్పారు. కర్నూలు నగరంలో ఇప్పటికే డోర్ టు డోర్ చెత్త సేకరణ కొనసాగుతోందని, కొత్త వాహనాలతో ఈ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కర్నూలు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఇప్పటికే దాదాపు రూ.140 కోట్లు కేటాయించామని, పార్కులు, రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు మరో రూ.100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తాం. నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కర్నూలు నగర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. కర్నూలును పరిశుభ్రమైన, పచ్చదనం కలిగిన, ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం’అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
టీటీడీ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు
గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ
Read Latest AP News And Telugu News