‘కుప్పం’ కథ మారింది!
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:48 AM
కుప్పం... ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం! ఆయన సొంత ఊరు నారావారిపల్లె ఉన్నది చంద్రగిరి నియోజకవర్గంలో! ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యింది చంద్రగిరి నుంచే! కానీ... పలు కారణాలతో చంద్రబాబు ‘కుప్పం’ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
పరిశ్రమలకు కేంద్రంగా నియోజకవర్గం
ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు
సుదీర్ఘబంధంతో సాధించిన సత్ఫలితాలు
ఒకప్పుడు సింగిల్ బస్సుకు సరిపడా ‘స్టాండు’
నేడు 118 కోట్లతో బస్టాండుకు శంకుస్థాపన
కరువు, వలసలు, కష్టాలకు నిలయం
డ్రిప్ ఇరిగేషన్, కృష్ణా జలాలతో మారిన సాగు
రోడ్లు, విద్యా సంస్థలు, అభివృద్ధితో మారిన రూపు
స్థానికంగా ఉపాధితో వలసలకు బ్రేక్‌పడే వీలు
కుప్పం... ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం! ఆయన సొంత ఊరు నారావారిపల్లె ఉన్నది చంద్రగిరి నియోజకవర్గంలో! ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యింది చంద్రగిరి నుంచే! కానీ... పలు కారణాలతో చంద్రబాబు ‘కుప్పం’ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 1989 నుంచి సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ‘కుప్పం’ రూపు రేఖలను మార్చివేశారు. అభివృద్ధికి చిరునామాగా మార్చారు.
చిత్తూరు, ఆంధ్రజ్యోతి): కుప్పం... 1989 నాటికి ముందు ఓ మారుమూల గ్రామం. రాష్ట్రానికి ఒక మూల... కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం. కేవలం ఒకే ఒక బస్సు నిలబడేంత చిన్న బస్టాండు. పక్కన ఓ చిన్న టీకొట్టు. ఆ పక్కనే ఫొటో స్టూడియో. అటు చిత్తూరుకు, ఇటు కృష్ణగిరికి వెళ్లేందుకు సన్నటి సింగిల్ రోడ్డు. అక్షరాస్యత, రాజకీయ చైతన్యం వంటి అనేక విషయాల్లో వెనుకబాటు. అభివృద్ధి ఏంటో తెలియని ప్రజలు. వలసలు నిత్యకృత్యం. ఇక్కడ కట్ చేస్తే... అదే కుప్పం... సింగిల్ రోడ్డు స్థానంలో డబుల్ రోడ్డు వచ్చింది. నియోజకవర్గంలో రోడ్డు సౌకర్యం లేని గ్రామమే లేదు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాల రాకతో కరువు పారిపోయింది. కుప్పం ఇప్పుడు పరిశ్రమల కేంద్రం! స్థానికంగా ఉపాధి లభిస్తుండటంతో ఆగిన వలసలు. రూ.118 కోట్లతో ఆధునిక బస్టాండు నిర్మాణానికి శంకుస్థాపన! భారీగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు! ఒకప్పుడు లక్షా అరలక్షకే దిక్కులేని చోట... ఇప్పుడు ఎకరా పొలం విలువ గరిష్ఠంగా కోటి రూకలకూ చేరింది.
నాటి నుంచి నేటి దాకా..
1989లో ఇప్పటిదాకా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తున్నారు. వెనుకబడిన ఆ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 1995లో ముఖ్యమంత్రి కావడంతో అప్పటి నుంచి కుప్పం దశ మారుతూ వచ్చింది. వినూత్న కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు కుప్పాన్నే ఎంచుకుంటారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ (డ్రిప్ ఇరిగేషన్)ని తొలుత ఇక్కడికే తీసుకొచ్చారు. హంద్రీనీవా కుప్పం ఉపకాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను నియోజకవర్గానికి తీసుకొచ్చి 110 చెరువుల్ని నింపారు. భూగర్భ జలాలు పెంచి ఇక్కడి కరువుకు శాశ్వత పరిష్కారం చూపించారు. పెద్దఎత్తున సబ్సిడీలు ఇచ్చి మల్బరీని ప్రోత్సహించారు. అటు చిత్తూరుకు, ఇటు తమిళనాడులోని కృష్ణగిరికి అనుసంధానిస్తూ డబుల్ రోడ్లు వేయించారు. ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానికంగా ఇల్లు నిర్మించుకున్నారు. ప్రతి మూడు నెలలకోసారి మూడు రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇలా కుప్పం నియోజకవర్గం కోసం చంద్రబాబు నిత్యం తపిస్తున్నారు. రాష్ట్ర మ్యాప్‌లో చిట్ట చివర ఉన్న కుప్పాన్ని.. ఇప్పుడు దేశంలోనే టాప్ నియోజకవర్గంగా మారుస్తున్నారు.
పరిశ్రమల పురోగతి ఇదీ..
రూ.9322 కోట్ల పెట్టుబడులతో దాదాపు 1000 ఎకరాల్లో 30 భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వాటిలో కొన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. మరికొన్ని పరిశ్రమల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 30.75 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పటికే ప్రారంభమైంది. సుమారు 500 మందికి ఉపాధి లభించింది. ఆర్గాఫీడ్ కంపెనీ కూడా ఉత్పత్తి ప్రారంభించింది. రూ.2081 కోట్లతో అథా గ్రూప్ బ్యాటరీ మెటీరియల్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. దీనిద్వారా 2600 మందికి ఉపాధి లభించనుంది. పయనీర్ క్లీన్ యాంప్స్ విమాన తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. దీనిద్వారా 1400 మందికి ఉపాధి లభించనుంది. అలాగే 20 వేల మందికి ఉపాధి లక్ష్యంతో రూ.899 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న అడిడాస్ ఫుట్‌వేర్ సంస్థకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తంగా రానున్న ఒకట్రెండు సంవత్సరాల్లో ఈ కంపెనీలన్నీ ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి ఇవ్వనున్నాయి.
పొరుగుపల్లె పరిసర గ్రామాల్లో..
గుడుపల్లె మండలంలోని పొగురుపల్లె కర్ణాటక సరిహద్దు గ్రామం. ఇక్కడ సుమారు వెయ్యి ఎకరాల్లో అన్నిరకాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ఈ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు మహర్దశ పట్టేసింది. పరిశ్రమలు రాకముందు అంటే.. రెండేళ్ల కిందట ఇక్కడ ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్యలో ఉండేది. ఇప్పుడు రూ.కోటి పైమాటే. పరిశ్రమల పక్కనున్న స్థలం రూ.కోటిన్నర అయినా దొరకడం లేదు. దీంతో పాటు హోటళ్లు, వసతి, కూలీల రవాణా, చిరు వ్యాపారాలతో చుట్టుపక్కల ప్రాంతాల వారికి జీవనోపాధి లభించింది. ఈ పారిశ్రామికవాడ సమీపంలోని పొగురుపల్లె, కె.గొల్లపల్లె, కుప్పిగానిపల్లె, కారిముట్ల, చింతరపాళ్యం, బిసానత్తం తదితర గ్రామాల యువత, వ్యాపారులకు జీవనోపాధి లభించనుంది.
ఇక వలసలకు బ్రేక్..
కుప్పం నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసినా, ఇక్కడి ప్రజలకు సరైన ఉపాధి అవకాశాలు లేక సమీపంలోని బెంగళూరుకు వలస వెళ్తుంటారు. పుష్ పుల్ రైలులో కుప్పం నుంచి ప్రతి రోజు ఉదయం బెంగళూరు వెళ్లి అక్కడ పనులు చేసుకుని సాయంత్రం మళ్లీ అదే రైలులో కుప్పం చేరుకుంటారు. ఇలా నిత్యం వేలాది మంది ప్రజలు బెంగళూరుకు వెళ్లి వస్తుంటారు. ఇప్పుడు నియోజకవర్గంలోని పొగురుపల్లెకు భారీ ఎత్తున పరిశ్రమలు వస్తుండడంతో, ఇక్కడే 40 వేలమందికి పరోక్షంగా, సుమారు 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. దీంతో ఇక బెంగళూరుకు వలస వెళ్లే అవసరం లేకుండా పోతుంది.
రైతులకు పెద్దఎత్తున పరిహారం..
పరిశ్రమల స్థాపన కోసం సేకరించిన భూములకు ఎకరాకు రూ.35 లక్షల చొప్పున అధికారులు ఇప్పించారు. సెటిల్‌మెంటు భూమికి రూ.35 లక్షలు, డీకేటీ అయితే రూ.16 లక్షల చొప్పున రైతులకు అందించారు. మల్బరీ సాగులో ఉంటే ఎకరాకు రూ.12 లక్షలు-రూ.16 లక్షలు.. బోరు ఉంటే రూ.3-5 లక్షలు.. కొబ్బరి చెట్టు ఉంటే ఒక్కోదానికి రూ.5 వేలు-10 వేలు అదనంగా ఇప్పించారు. ఆశించినదాని కంటే ఎన్నోరెట్లు అధికంగా పరిహారం దక్కడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
167 చిన్న పరిశ్రమలకు ఆహ్వానం..
పొగురుపల్లెలోనే సుమారు 44 ఎకరాల్లో ఏపీఐఐసీ తరఫున ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇటీవల కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అవసరమైర రోడ్లు, కాలువలు, విద్యుత్తు వంటి అన్ని మౌలిక వసతులూ కల్పించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే, వారి కోసం 167 ప్లాట్లను సిద్ధం చేశారు.
రియల్ ఎస్టేట్‌కూ ఊపు..
పొగురుపల్లె గ్రామంలో రైతులు తమ భూముల్ని ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. చదరపు అడుగు రూ.1200 చొప్పున విక్రయిస్తు న్నారు. కుప్పం నుంచి ఈ గ్రామానికి వెళ్లే మార్గమంతా.. రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న వెంచర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా ప్లాట్లుగా అమ్మితే ఎకరాకు రూ.3.50 కోటిపైనే వస్తుంది. పరిశ్రమల రాకతో ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కూ ఊపు వచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇప్పుడు నేను కోటీశ్వరుడ్ని: గోవిందస్వామి, పొగురుపల్లె
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమల ఊసే లేదు. దీంతో ఎకరా విలువ రూ.12-15 లక్షల మధ్యలో ఉండేది. ఇప్పుడు మా గ్రామం చుట్టూ పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేశాయి. ఎకరా రూ.1.20 కోటి నుంచి రూ.1.50 కోటి మధ్యలో ధర పలుకుతోంది. అయినా రైతులు అమ్మడం లేదు. ఇటీవల శంకుస్థాన చేసిన బ్యాటరీలు తయారు చేసే అథా కంపెనీ పక్కన నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు నేను కోటీశ్వరుడ్ని.
గుడుపల్లె మండలం ఇంత అభివృద్ధి చెందుతుందనుకోలేదు: జయప్ప, పొగురుపల్లె
ఇటీవల పొగురుపల్లెలో అడిడాస్ ఫుట్‌వేర్ కంపెనీకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కంపెనీ కోసం 1.38 ఎకరాల నా భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఎకరాకు రూ.35 లక్షల చొప్పున మొత్తం రూ.48.57 లక్షల చెక్కు నాకు అందించారు. నా భూమి విలువ ఎకరా రూ.10 లక్షలకు మించి లేదు. మా ప్రాంతం ఇంతలా అభివృద్ధి చెందుతుందనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది.
సీఎం మా భవిష్యత్తునే మార్చేశారు: చందు, చింతరపాళ్యం, పొగురుపల్లె పంచాయతీ
మూడేళ్ల కిందట ఇక్కడ పరిశ్రమల ఊసే లేదు. మాకున్న 5 ఎకరాల్ని రూ.22 లక్షలకు అమ్మేసుకున్నాం. ఇప్పడు దాని విలువ రూ.6 కోట్ల వరకు ఉంటుంది. పరిశ్రమల ప్రాంతానికి కాస్త దూరంగా చింతరపాళ్యంలో మాకింకా 5 ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. సీఎం చంద్రబాబు మా ప్రాంతానికి పరిశ్రమల్ని తెచ్చి మా బతుకుల్ని, భవిష్యత్తును పూర్తిగా మార్చేశారు. ఆయా కంపెనీల భూమిని చదును చేసే కాంట్రాక్టరుగా నేను పనులు చేసుకుంటున్నాను.
ఇవి కూడా చదవండి
ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు