Share News

విజయవాడ రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌కు ఆటంకాలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 07:03 AM

విజయవాడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. టెండర్లు పిలిచి ఐదు నెలలు కావస్తున్నా ఏ కాంట్రాక్టు సంస్థ కూడా ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో బిడ్ల ఖరారు వ్యవహారాన్ని రైల్వే అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు.

విజయవాడ రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌కు ఆటంకాలు
Vijayawada Railway Station

» టెండర్లు పిలిచి ఐదు నెలలు దాటినా అతీగతీ లేదు

» కాంట్రాక్టర్ల నుంచి అనాసక్తి.. టెండర్లు వరుస వాయిదా

» డిసెంబరులో తెరవాల్సిన టెండర్లు ఏప్రిల్ 24కు..

» రైల్వేస్టేషన్‌ను ఐసోలేట్ చేస్తున్నారనే కారణమేనా?


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అమృత్ భారత్ కింద అనేక రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్న రైల్వే అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేట్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. డిజైన్-బిల్డ్- ఫైనాన్స్- ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎస్వోటీ) విధానంలో అభివృద్ధి చేయాలని తలచిన రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) గత ఏడాది అక్టోబరు 1న రూ.661.11 కోట్లతో టెండర్లు పిలిచింది. నోటిఫికేషన్ ప్రకారం డిసెంబరు 2నే టెండర్లు తెరవాలి. ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. దీనిని బట్టి టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదని అర్థమవుతోంది. కాంట్రాక్టర్ల ఆనాసక్తి కారణంగానే టెండర్లు వాయిదా పడుతూ వస్తున్నాయని తెలుస్తోంది. టెండర్లు పిలిచాక విజయవాడలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్లో ఆసక్తి చూపుతున్న సంస్థలతో సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం జరిగిందా? కాంట్రాక్టర్లు వచ్చారా? వారి అభిప్రాయాలు ఏమిటన్నది రైల్వే అధికారులు గుట్టుగా ఉంచారు.


వరుస వాయిదాలు

డిసెంబరు 2 నుంచి వరుసగా ఆర్ఎల్డీఏ అధికారులు టెండర్లను వాయిదా వేస్తూ వస్తున్నారు. డిసెంబరు 2న టెండర్లు తెరవాల్సి ఉండగా, 9 వరకు వాయిదా వేశారు. డిసెంబరు 15, జనవరి 1, 7, ఫిబ్రవరి 20, మార్చి 30 తేదీలకు వాయిదా వేస్తూ వచ్చారు. చివరగా ఏప్రిల్ 24 తేదీకి వాయిదా వేశారు. ఎన్నిసార్లు గడువులు పెంచుతున్నా కాంట్రాక్టర్ల నుంచి ఆసక్తి లేదని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై కాంట్రాక్టర్లు ఎందుకు అనాసక్తి కనబరుస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.


ఎందుకు అనాసక్తత

కమర్షియల్ ఆదాయం కోసం రైల్వే అధికారులు డీబీఎఫ్‌వోటీ విధానంలో టెండర్లు పిలిచారు. కానీ, కాంట్రాక్టు సంస్థలు తమకు లాభసాటిగా ఉంటుందా? అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే అధికారులు ఒకవైపు రీడెవలప్‌మెంట్‌ టెండర్లు పిలిచి, మరోవైపు రైల్వే స్టేషన్‌ను ఐసోలేట్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో కాంట్రాక్టర్లకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయడంతోపాటు అమరావతి రైల్వేలైన్‌ను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మీదుగా తీసుకెళ్తుండటం, మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ ప్రతిపాదన ఉండటం, గుణదలను కూడా శాటిలైట్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేస్తుండటం వంటి కారణాల వల్ల రానున్న రోజుల్లో విజయవాడ రైల్వేస్టేషన్ ఐసోలేట్ అయ్యే ప్రమాదం ఉందన్న భావన కాంట్రాక్టు సంస్థల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రూ.611 కోట్లు వెచ్చించి స్టేషన్‌ను పునర్ నిర్మిస్తే రైల్వేస్టేషన్ ప్రాభవం, ప్రాధాన్యత తగ్గిపోతే నష్టపోవాల్సి ఉంటుందన్న ఆలోచనలో కాంట్రాక్టు సంస్థలు ఉన్నట్టుగా సమాచారం. తమకున్న అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నప్పటికీ సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఈ కారణంగానే టెండర్లలో పాలు పంచుకోవటానికి ఆసక్తి చూపించడం లేదని సమాచారం. దీంతో రైల్వే అధికారులు టెండర్లను వాయిదా వేస్తూ వస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇజ్రాయెల్ తాజా దాడులపై ఇరాన్ ఆగ్రహం.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

ముగ్గురు చిన్నారులతో బావిలోకి దూకిన తల్లి

Updated Date - Mar 28 , 2026 | 07:06 AM