Share News

సూర్యఘర్‌ లక్ష్యం.. 2 వేల కనెక్షన్లు!

ABN , Publish Date - Mar 28 , 2026 | 06:06 AM

రాష్ట్రంలో విద్యుత్తు శాఖ పరిధిలో అమలవుతున్న పనులను వేగవంతం చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు.

సూర్యఘర్‌ లక్ష్యం.. 2 వేల కనెక్షన్లు!

  • ఏప్రిల్‌ 14కి ప్రతి నియోజకవర్గంలో పూర్తి చేయాలి

  • ఎస్సీ, ఎస్టీలకు కనెక్షన్లపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు శాఖ పరిధిలో అమలవుతున్న పనులను వేగవంతం చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి డిస్కంల సీఎండీలు, ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పీఎం సూర్యఘర్‌, ఆర్డీఎస్ఎస్(రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం), పీఎం కుసుమ్‌ పథకాల పురోగతిని సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా అందిస్తున్న పీఎం సూర్యఘర్‌ సోలార్‌ కనెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి నియోజకవర్గంలోనూ ఏప్రిల్‌ 14లోపు 2వేల కనెక్షన్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యసాధనకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లన్నింటినీ వచ్చే సీజన్‌కు ముందే మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అందించాలన్నారు. సీఎం చంద్రబాబు హామీ మేరకు ప్రజలపై విద్యుత్తు చార్జీలను మోపకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందుకే రూ.16వేల కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించేందుకు అంగీకరించిందని తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 06:07 AM