Share News

గిరిపురంలో అతిసారానికి నీటి కలుషితమే కారణమని భావిస్తున్నాం: డీఎంహెచ్‌ఓ

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:09 AM

విజయవాడలోని గిరిపురంలో డయేరియా ప్రబలడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎమ్‌హెచ్‌ఓ శ్రావణ్ కుమార్ గిరిపురంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.

గిరిపురంలో అతిసారానికి నీటి కలుషితమే కారణమని భావిస్తున్నాం: డీఎంహెచ్‌ఓ
DMHO Vijayawada

విజయవాడ, జులై 18: నగరంలోని గిరిపురంలో డయేరియా ప్రబలడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎమ్‌హెచ్‌ఓ(DMHO) శ్రావణ్ కుమార్ ఈరోజు(శనివారం) గిరిపురంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అనంతరం డీహెమ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. గిరిపురంలో నీటి కలుషితం కారణంగా అతిసారం వచ్చినట్లు భావిస్తున్నామని.. శాంపిల్స్‌‌‌ను ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ ప్రతి నిమిషం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.


వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని శ్రావణ్ తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి హౌస్ టు హౌస్ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎవరికైనా వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారన్నారు. తీవ్రంగా ఉన్న బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారని వెల్లడించారు. గిరిపురంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయన్నారు.


ప్రభావిత ప్రాంతాల్లో పరిశుభ్రత చాలా తక్కువగా ఉందని.. వర్షం వచ్చినప్పుడు నీరు నిలవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీహెమ్‌హెచ్‌ఓ తెలిపారు. మున్సిపల్ అధికారులు రక్షిత నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. నీటిని బాగా మరిగించి, చల్లార్చిన తర్వాతే తాగాలని.. ఇలా చేయడం వల్ల 99.9% అనారోగ్య సమస్యలు రావని సూచించారు. తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూతలు పెట్టుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. ప్రస్తుతానికి మాంసాహారం మానేసి.. శాఖాహారం, సాఫ్ట్ డైట్ మాత్రమే తీసుకోవాలన్నారు. అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర ముందస్తు మందుల కి‌ట్‌లను పంపిణీ చేశామని డీఎమ్‌హెచ్‌ఓ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. డీజే ప్లేయర్‌పై కేసు నమోదు

నల్లగొండలో కలకలం: వైద్య విద్యార్థిని, యువకుడి అనుమానాస్పద మృతి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 12:12 PM