వైఎస్ జగన్ శాంతి దూతలా ప్రవచనాలు చేస్తున్నారు: ఎంపీ కేశినేని చిన్ని
ABN , Publish Date - May 22 , 2026 | 05:26 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి శాంతి దూత ప్రవచనాలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. గురువారం నాడు జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి శాంతి దూత ప్రవచనాలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మండిపడ్డారు. జగన్ నిన్న (గురువారం) నిర్వహించిన ప్రెస్ మీట్ చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు. జగన్ కుటుంబ చరిత్ర తెలియనివారు లేరని.. ప్రెస్ మీట్‌లో ఆయన మాటలు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చిన్ని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం బాధాకరమని.. ఆయన మృతిపై జగన్‌కు అనుమానాలు ఉన్నాయన్నారు.
అయితే, రాజశేఖర్ రెడ్డి పార్థివదేహం ఇంటికి రాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేశారన్నారు. ఇదే విషయాన్ని చాలామంది సీనియర్ నేతలు తనకు చెప్పారని.. వారంతా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో రౌడీయిజం రాజ్యమేలిందని ఎంపీ చిన్ని ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి సౌమ్యుడని.. ఆయన్ను దారుణంగా హత్య చేశారన్నారు. వివేకా హత్య కేసుపై ఫ్యాన్ పార్టీ అధినేత మొదట సీబీఐ విచారణ కోరారని, తర్వాత మళ్లీ వెనక్కి తగ్గారని ఎంపీ చెప్పుకొచ్చారు. సీబీఐ విచారణ అంతా జగన్ కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతోందని పేర్కొన్నారు. వైసీపీ గొడ్డలి పార్టీ కాబట్టి అదే గుర్తును పెట్టుకుంటే బాగుంటుందని ఎంపీ చిన్ని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్నారని.. ఆయన తన విషపు కళ్లతో అద్భుతమైన రాజధానిని చూస్తారని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. 'మావిగన్' పేరు చెప్తే సీఎం చంద్రబాబు నాయుడికి గుండె నొప్పి వస్తుందని అంటున్నారని.. మావిగన్‌తో జగన్ కామెడీ పీస్‌గా మిగిలిపోతారని ఎంపీ చిన్ని వ్యంగ్యంగా అన్నారు. ఆంధ్రాకు ఏదైనా బ్రాండ్ ఉందంటే అది చంద్రబాబు నాయుడేనని.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఆ 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
టైగర్ రంగా (వంగవీటి రంగా) మానవతావాది అని తాను ఘంటాపథంగా చెబుతానని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని ఎంపీ చెప్పుకొచ్చారు. రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికే వైసీపీ జిల్లా అధ్యక్షుడి పదవిని జగన్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఈరోజు విజయవాడ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడేనని చిన్ని కొనియాడారు. మంత్రి నారా లోకేశ్‌ను చూసి జగన్ ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఎంపీ చిన్ని హితవుపలికారు.
ఈ వార్తలు కూడా చదవండి
పెన్షన్లపై జగన్ అబద్ధపు ప్రచారాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అనంతపురం జిల్లాలో గోల్డ్ మైన్స్ గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర