కొరియా కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం.. బుసాన్‌లో APEX-Korea ప్రారంభం
ABN , Publish Date - Jul 08 , 2026 | 10:52 AM
దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. బుసాన్‌లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో APEX-Korea కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు.
దక్షిణ కొరియా/అమరావతి, జులై 8: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడులపై కొరియా సంస్థలతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్నారు. బుసాన్‌లో APEX-Korea పెట్టుబడిదారుల సహాయ కేంద్రం ప్రారంభమైంది. ఏపీఈడీబీ ఆధ్వర్యంలో APEX-Korea కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు. కొరియా సంస్థలు, ఏపీ ప్రభుత్వం మధ్య అనుసంధాన వేదికగా APEX-Korea నిలవనుంది. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపే కొరియా కంపెనీలకు పూర్తి సహకారం అందించనుంది. ఏపీలో ఇప్పటికే ఉన్న కొరియా సంస్థలకు APEX-Korea సేవలు అందించనుంది. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణే లక్ష్యంగా APEX-Koreaను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బుసాన్‌లో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను కొరియా సంస్థలకు వివరించారు. బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. అమరావతిలో బీఎన్‌కే ఫైనాన్షియల్ శాఖ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అమరావతి, పారిశ్రామిక పార్కులకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, షిప్‌బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఏపీని పెట్టుబడులు, ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకోవాలని కొరియా సంస్థలకు పిలుపునిచ్చారు. స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలకు మద్దతుగా ఆర్‌టీఐహెచ్‌లో(RTIH) భాగస్వామ్యం కావాలని బీఎన్‌కేను మంత్రి ఆహ్వానించారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బీఎన్‌కే ప్రతినిధులు తెలిపారు. బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్ ఏకీకృత ఆస్తుల విలువ రూ.9.64 లక్షల కోట్లు కాగా.. మూడు బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలతో ఈ గ్రూప్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బీఎన్‌కే గ్రూప్‌కు కొరియాలో 398 శాఖలు, విదేశాల్లో 75 అవుట్‌లెట్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
గుడివాడలో నగల పేరుతో మోసం.. వైసీపీ నేతపై కేసు నమోదు
కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
Read Latest AP News And Telugu News